ప్రత్యేక హోదా...చాన్నాళ్ళ తర్వాత వైసీపీ నోట

ప్రత్యేక హోదా అన్నది వైసీపీకి 2019 ఎన్నికల ముందు ఒక ఆయుధంగా మారింది అన్నది తెలిసిందే ఈ అంశం మీద జగన్ సభకు నిర్వహించారు.;

Update: 2026-04-05 03:35 GMT

ప్రత్యేక హోదా అన్నది వైసీపీకి 2019 ఎన్నికల ముందు ఒక ఆయుధంగా మారింది అన్నది తెలిసిందే ఈ అంశం మీద జగన్ సభకు నిర్వహించారు. యువ భేరీలు నిర్వహించారు. జనంలోకి వెళ్ళారు, ర్యాలీలు సభలు సమావేశాలు పెట్టారు, ఇవన్నీ కూడా 2014 నుంచి 2019 మధ్యలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర రాజెకీయ ఒత్తిడిని కలిగించాయి. చివరికి 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి ఈ ఇష్యూ కూడా కారణం అయింది. ఇక తమకు మొత్తం పాతికకు పాతిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ స్వయంగా పాదయాత్రలో చెప్పి ఉన్నారు.

చేతులెత్తేసిన వైనం :

అయితే 2019లో వైసీపీకి ఏకంగా 25 ఎంపీ సీట్లకు గానూ 22 సీట్లను జనం ఇచ్చారు. కానీ ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. పైగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని తాము ఏమీ చేయలేమని వైసీపీ పెద్దలు చేతులెత్తేసిన విషయాన్ని అంతా చూశారు. ఏదో మాటకు వస్తే ఒకసారి మొక్కుబడిగా ప్రత్యేక హోదా గురించి వల్లించడమే తప్ప అయిదేళ్ళ తమ జమానాలో ప్రత్యేక హోదా అన్నది ఆ పార్టీ చేయలేకపోయింది అన్నది అంతా చూశారు.

బాబు సాధించాలంటూ :

మళ్ళీ ఇన్నాళ్ళకు అది కూడా 2024 ఎన్నికల్లో మాట్లాడలేదు, గడచిన రెండేళ్ళుగా ఎక్కడా వైసీపీ ప్రత్యేక హోదా గురించి అసలు మాట్లాడలేదు, కానీ ఇపుడు సడెన్ గా ప్రత్యేక హోదా తేవాలని టీడీపీ కూటమి మీద ఒత్తిడి పెడుతోంది. దానిని డిమాండ్ గా ముందుకు తెస్తోంది. వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బాబుని ఇదే అంశం మీద డిమాండ్ చేశారు. అమరావతికి చట్టబద్ధత సాధించామని మురిసిపోవడం కాదు, ప్రత్యేక హోదా తీసుకుని రండి అని ఆయన సవాల్ చేశారు. కూటమి పెద్దలు అంతా కలసి ఈ నెల 16 నుంచి 18 దాకా మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాంలో హోదా మీద చట్టం చేయించాలని ఆయన కోరారు.

ముగిసిన అధ్యాయం కాదు :

ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని అంటూ బొత్స మాట్లాడడం విశేషం. హోదా వల్ల అమరావతి వంటి పది మహా నగరాలను నిర్మించవచ్చు అని బాబుకు సూచించారు. హోదా మాత్రమే కాకుండా విభజన హామీలను కూడా అమలు అయ్యేలా కేంద్రం మీద కూటమి పెద్దలు ఒత్తిడి తేవాలని బొత్స కోరడం విశేషం. దీంతో హోదా వైసీపీకి ముగిసిన అధ్యాయం కాదా అది మరోసారి తెరిచిన అధ్యాయమా అన్న చర్చ సాగుతోంది.

జనాలు నమ్ముతారా :

ఇక చూస్తే కనుక పదేళ్ళ క్రితం అయితే హోదా విషయం మీద వైసీపీ ఉద్యమించినా జనాలు స్పందించారు. ఎంతో కొంత ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇన్నాళ్ళూ వదిలేసి ఇపుడు హోదా మీద వైసీపీ మాట్లాడితే జనాలు విశ్వసిస్తారా అన్న చర్చ సాగుతోంది. రాజధాని అంశం కూటమిని సెంటిమెంట్ గా మారుతోందని గ్రహించిన వైసీపీ దానికి రివర్స్ స్ట్రాటజీగా హోదా అంశాన్ని జనంలోకి తెస్తోందా అన్న చర్చ సాగుతోంది. అయితే హోదా విషయం మళ్ళీ రాజకీయంగా పదును పెట్టాలని చూసినా వర్కౌట్ అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి అన్నది ఏపీ జనాలకు అర్ధం అయ్యాక చేస్తే పోరాటం ఢిల్లీలో చేయాలి కానీ గల్లీలో కాదనే అంతా అంటున్నారు. మరి ఆ సత్తా వైసీపీకి ఉందా అన్నది కూడా ప్రత్యర్ధులు వేసే ప్రశ్నలుగా ఉన్నాయి.

Tags:    

Similar News