మొన్న తైవాన్.. నేడు సౌత్ కొరియా.. ప్రపంచ మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి పడిపోయిన భారత్
నిన్నటివరకు ప్రపంచ స్టాక్ మార్కెట్ల రేసులో "మనం సూపర్ పవర్ అయిపోతున్నాం.. అందరినీ వెనక్కి నెట్టేస్తున్నాం" అంటూ కాలర్ ఎగరేసిన దలాల్ స్ట్రీట్ బుల్స్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.
నిన్నటివరకు ప్రపంచ స్టాక్ మార్కెట్ల రేసులో "మనం సూపర్ పవర్ అయిపోతున్నాం.. అందరినీ వెనక్కి నెట్టేస్తున్నాం" అంటూ కాలర్ ఎగరేసిన దలాల్ స్ట్రీట్ బుల్స్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. పోయిన వారం తైవాన్ వచ్చి సైలెంట్‌గా మనల్ని పక్కకు నెట్టేస్తే.. తాజాగా దక్షిణ కొరియా కూడా 'స్పీడ్' పెంచి భారత్‌ను ఓవర్‌టేక్ చేసింది. దీంతో గ్లోబల్ మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో మన దేశం ఏకంగా ఏడో స్థానానికి పడిపోయింది!
నంబర్ల ఆటలో.. కొరియా "కె-పాప్" డాన్స్!
జూన్ 1 నాటి లెక్కల ప్రకారం.. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ టోటల్ వాల్యూ 5.04 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరి మన పరిస్థితి? మనం 4.84 ట్రిలియన్ డాలర్ల దగ్గరే బ్రేకులు పడి ఆగిపోయాం. ఇక మనకంటే ముందే లైన్ దాటేసిన తైవాన్ 5.15 ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో హాయిగా కూర్చుంది. ఆసియా మార్కెట్ల మధ్య రేసు చూస్తుంటే.. భారత్ స్లో మోషన్‌లో వెళ్తుంటే, మిగతా దేశాలు మెరుపు వేగంతో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఏఐ మహిమ.. చిప్స్ ఉన్నాయి కాబట్టే ఆ 'కిక్'!
2026లో దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్లు పెరిగిన తీరు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ సూచీ ఈ ఏడాది ఏకంగా 110 శాతం పైగా పెరిగింది. తైవాన్ మార్కెట్ 65 శాతం కంటే ఎక్కువ లాభపడింది. అసలు సీక్రెట్ ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ల విప్లవాన్ని ఈ రెండు దేశాలు గట్టిగా వాడుకున్నాయి. టీఎస్ఎంసీ , శాంసంగ్, ఎస్.కే హైనిక్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఏఐ డేటా సెంటర్లకు కావలసిన చిప్స్, హై-బ్యాండ్‌విడ్త్ మెమరీని సప్లై చేస్తూ నోట్ల కట్టలు వెనకేసుకుంటున్నాయి. ప్రపంచ ఏఐ విప్లవానికి వీరే ఇప్పుడు 'మెయిన్ సెంటర్లు' అయిపోయారు.
మరి మన 'దలాల్ స్ట్రీట్' ఎందుకు నీరసించింది?
అక్కడ కొరియా, తైవాన్‌లు రాకెట్‌లా దూసుకెళ్తుంటే.. మన మార్కెట్లు మాత్రం రివర్స్ గేర్ వేశాయి. 2026లో ఇప్పటివరకు సెన్సెక్స్ 12 శాతం, నిఫ్టీ 15 శాతం వరకు కుంగాయి. మన మార్కెట్‌ను ముంచేసిన 'ఆరుగురు మొనగాళ్లు' ఎవరని చూస్తే.. విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్లో షేర్లను తెగనమ్మేసి బ్యాగులు సర్దుకుంటున్నారు. షేర్ల రేట్లు ఆకాశంలో ఉండటం.. కానీ కంపెనీల లాభాలు మాత్రం నేలచూపులు చూడటం... అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ గొడవలు, ప్రపంచ వాణిజ్య యుద్ధాల వల్ల
డాలర్ ముందు రూపాయి డీలా పడిపోయింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు $100 దాటేయడంతో ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు పెరిగిపోయాయి. మన దగ్గర సాఫ్ట్‌వేర్ సర్వీసులు ఉన్నాయి కానీ, ప్రపంచాన్ని శాసిస్తున్న భారీ ఏఐ ప్రొడక్ట్ లేదా చిప్ తయారీ కంపెనీలు లేకపోవడం మైనస్ గా మారింది.
విశ్లేషకులు ఏమంటున్నారు?
ఇంధన, ముడిసరుకు ధరలు పెరిగిపోవడం వల్ల కంపెనీల ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరుగుతాయని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పెరిగిన ఖర్చుల భారాన్ని వినియోగదారులపై పూర్తిగా మోపలేక కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు.
ఇకనైనా అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడాలని..మంచి వర్షాలు పడి మార్కెట్ కోలుకోవాలని కోరుకోవడం ఒక ఎత్తయితే.. ప్రపంచాన్ని ఊపేస్తున్న ఏై, సెమీకండక్టర్ల వంటి కొత్త తరం సాంకేతికతలను భారత్ ఎంత వేగంగా అందిపుచ్చుకుంటుంది అనేది మరో ఎత్తు. ఆ స్పీడ్ పెంచకపోతే.. రేపు పొద్దున మరేదైనా చిన్న దేశం వచ్చి మనల్ని వెనక్కి నెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు!