సౌత్ కోస్ట్ రైల్వే జోన్.. కేంద్రం కీలక నిర్ణయం, నెక్ట్స్ అదేనా!
విశాఖ కేంద్రంగా రైల్వేశాఖ ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాకలాపాలు ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది.;
విశాఖ కేంద్రంగా రైల్వేశాఖ ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాకలాపాలు ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. విశాఖ, విజయవాడ, గుంతకల్లు డివిజన్లను కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ మొత్తం ఒకే జోన్ కింద ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఒడిశాలోని ఖర్దా రోడ్ డివిజన్ లో ఉన్న ఏడు స్టేషన్లను విశాఖ డివిజన్ కు బదిలీ చేస్తూ తాజాగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉత్తరాంధ్రలోని పలాస నుంచి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లు ఇకపై విశాఖ రైల్వే జోన్ కిందకు తెస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ జోన్ విషయంలో రైల్వేశాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు కీలకంగా చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెలలోనే విశాఖ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావాల్సివుంది. కానీ, పరిపాలన భవనాల నిర్మాణం పూర్తికాకపోవడం, సిబ్బంది సర్దుబాటు పూర్తికాకపోవడం వల్ల జోన్ కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో జోన్ విషయంలో నెలకొన్న స్తబ్దతను తొలగిస్తూ రైల్వే శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు మళ్లీ కదలిక తీసుకువచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక విశాఖ జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రైల్వేశాఖ సుమారు రూ. 106 కోట్లు కేటాయించింది. ఈ డబ్బుతో నగరం శివార్లలోని ముడసరలోవలో జోన్ భవనాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే వీటి నిర్మాణం పూర్తిచేసి జోన్ కార్యకలాపాలు మొదలుపెట్టాలని ప్రభుత్వం తొలుత భావించినా, నిర్మాణ పనులలో జాప్యం జరుగుతుండటం వల్ల శాశ్వత భవనం పూర్తయ్యేలోపు విశాఖలోని 'ది డెక్' భవనం నుంచి తాత్కాలికంగా కార్యకలాపాలు సాగించేందుకు ఏర్పాట్లు చేసేందుకు రైల్వే ముందుకొచ్చింది.
అంతేకాకుండా సుమారు 17 వేల మంది సిబ్బందిని ఈ కొత్త జోన్‌కు కేటాయించే ప్రక్రియను రైల్వే సీనియర్ అధికారుల నియామకాలు తుది దశకు తీసుకువచ్చారని చెబుతున్నారు. దీంతో విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖ డివిజన్లతో కూడిన 'సౌత్ కోస్ట్ రైల్వే' దక్షిణ భారత దేశంలోనే అత్యంత కీలకమైన జోన్‌గా అవతరించబోతోందని విశ్లేషిస్తున్నారు. సరుకు రవాణాలో విశాఖ, గంగవరం పోర్టుల అనుసంధానం వల్ల జోన్ ఆదాయాన్ని భారీగా పెంచనుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మైలురాయిగా నిలవనున్న విశాఖ రైల్వే జోన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.