రాహుల్ తో నా ఆత్మ కలిసింది.. ఆ లేఖ ఆస్కార్ : రేవంత్
కులగణనను 'తెలంగాణ మోడల్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్'గా పిలవడానికి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, దానిని 'రేర్' (RARE) మోడల్ అని పిలవవచ్చని రేవంత్ రెడ్డి సూచించారు.;
తెలంగాణలో కులగణన చేపట్టినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనను అభినందిస్తూ లేఖ రాయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ లేఖ తనకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అని, ఆస్కార్ అవార్డు, నోబెల్ ప్రైజ్‌తో సమానమని ఆయన పేర్కొన్నారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పనులు చేసినా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, వీటన్నిటికంటే సోనియా గాంధీ రాసిన ఈ లేఖ తనకు చాలా గొప్పదని ఉద్ఘాటించారు. "సోనియా గాంధీ నన్ను మెచ్చుకుంటూ లేఖ రాసింది. ఇది నాకు ఆస్కార్ అవార్డ్, నోబెల్ బహుమతి, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్," అని ఆయన అన్నారు.
'రేర్' మోడల్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్
కులగణనను 'తెలంగాణ మోడల్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్'గా పిలవడానికి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, దానిని 'రేర్' (RARE) మోడల్ అని పిలవవచ్చని రేవంత్ రెడ్డి సూచించారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టలేదని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ చారిత్రక కార్యక్రమాన్ని సోనియా గాంధీ గుర్తించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీతో ఆత్మీయ అనుబంధం
"మీది కాంగ్రెస్ పార్టీ కాకపోయినా సీఎం సీట్ ఎలా దక్కిందని అందరూ అడుగుతుంటారు" అని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. దీనికి సమాధానంగా రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. "రాహుల్ భయ్యాతో నా ఆత్మ కలిసింది. రాహుల్ భయ్యా మనసులో ఉన్న పని చేయాలని నేను డిసైడ్ అయ్యాను. నా అధినేత రాహుల్ భయ్యా ఏదైనా చెప్పాడంటే అది నాకు బంగారు గీత," అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌పై విమర్శలు
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లపై పరోక్ష విమర్శలు చేశారు. "కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌ని తెలంగాణ లెక్కలో నుంచి తీసేశాం," అని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మారాయి..