తల్లిదండ్రుల సమాధులను ఒకే చోటుకి.. సమాజంతో ఫైట్ చేసిన కొడుకు..

జీవితం అంటే ఒకే చోట కుదురుగా ఉండేది కాదు.. పనులు, ఉద్యోగం ఇలా కారణం ఏదైనా మరో చోటుకి వెళ్లక తప్పదు.. తిరిగి రావడం రాకపోవడం విధి నిర్ణయం.;

Update: 2026-02-21 06:28 GMT

జీవితం అంటే ఒకే చోట కుదురుగా ఉండేది కాదు.. పనులు, ఉద్యోగం ఇలా కారణం ఏదైనా మరో చోటుకి వెళ్లక తప్పదు.. తిరిగి రావడం రాకపోవడం విధి నిర్ణయం. పని కోసం, పరిస్థితుల కోసం, విధి కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లకతప్పదు. కానీ మనసుల్లోని బంధాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు. కేరళకు చెందిన శిబు కురియకోస్‌ కథ ఆ అనుబంధాల గాఢతను గుర్తుచేస్తోంది. భౌతికంగా 37 ఏళ్లుగా వేర్వేరు జిల్లాల్లో ఉన్న తల్లిదండ్రుల సమాధులను ఒకేచోటుకు చేర్చాలనే అతని సంకల్పం.. చివరకు నెరవేరింది.

430 కిలో మీటర్ల దూరంలో తండ్రి ఖననం..

శిబు తండ్రి అలెగ్జాండ్రియోస్‌ కుటుంబ పోషణ కోసం కొట్టాయం నుంచి దాదాపు 430 కిలోమీటర్ల దూరంలోని కాసరగోడ్‌కు వెళ్లి ఉద్యోగం చేసేవారు. తర్వాత క్రైస్తవ మతబోధకుడిగా మారి సేవ చేశారు. 1989లో ఆయన మృతి చెందగా, కాసరగోడ్‌లోనే ఖననం చేశారు. కాలగమనంలో జీవితం ముందుకు సాగిపోయింది. కానీ తండ్రి సమాధి అక్కడే మిగిలిపోయింది.

2021లో తల్లిని కొట్టాయంలో..

ఇక తల్లి థంకమ్మ తన కుమారుడు శిబుతో కలిసి కొట్టాయంలో నివసించారు. 2021లో ఆమె కన్నుమూశారు. కొట్టాయంలోని కొల్లాద్‌ శ్మశా నవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అప్పటి నుంచి శిబు మనసులో ఒక బాధ ఉండిపోయింది. తండ్రి ఒకచోట, తల్లి మరో చోట.. వేర్వేరు జిల్లాల్లో ఉన్న సమాధులు అతని మనసును కలచివేశాయి. జీవితమంతా కలిసే నడిచిన తల్లిదండ్రులు మరణానంతరం కూడా వేరువేరుగా ఉండడం అతనికి తట్టుకోలేని విషయంగా మారింది.

గట్టి సంకల్పం..

దీంతో శిబు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన తండ్రి శవపేటికను కాసరగోడ్‌ నుంచి కొట్టాయంకు తీసుకొచ్చి, తల్లి సమాధి పక్కనే ఖననం చేయాలి. అయితే ఇది సాధారణ ప్రక్రియ కాదు. ఒక శ్మశాన వాటిక నుంచి మరొక శ్మశాన వాటికకు శవపేటిక తరలించాలంటే ప్రభుత్వం నుంచి అనేక అనుమతులు కావాలి. దీంతో పాటు మత పెద్దల నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. రెండు జిల్లాల కలెక్టర్ల సమ్మతి, బంధువుల నుంచి లిఖితపూర్వక అంగీకారం.. ప్రతి దశలో పలు విధానాలు, నిబంధనలు. దీనిపై శిబు స్పందిస్తూ ‘దీని కోసం ఏడాది పాటు కార్యాలయాల చుట్టూ తిరిగాను. చర్చిల వద్ద ప్రాధేయపడ్డాను. అవసరమైన పత్రాలు సేకరించాను. అనుమతుల కోసం ఎదురుచూశాను’ అంటూ భావోద్వేగంగా చెప్పారు. ఎన్నో అడ్డంకులు వచ్చినా అతను వెనుదిరగలేదు. తండ్రిని తల్లి పక్కన ఖననం చేయాలనే కోరిక అతనికి శక్తి నిచ్చింది.

ఫిబ్రవరి 19న కల నెరవేరిన రోజు..

చివరకు అన్ని అనుమతులు లభించాయి. కాసరగోడ్‌లోని సమాధిని తెరిచి, శవపేటికను శాస్త్రీయ పద్ధతుల్లో తరలించారు. కొట్టాయంలోని కొల్లాద్‌ శ్మశాన వాటికలో తల్లి సమాధి పక్కనే గురువారం (ఫిబ్రవరి 19) ఖననం చేశారు. ఆ క్షణం శిబుకు మాటల్లో చెప్పలేని తృప్తిని ఇచ్చింది. ‘ఇప్పుడే నా మనసుకు శాంతి లభించింది. అమ్మానాన్నలు మళ్లీ కలిశారు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఆదర్శమైన కథ..

ఈ ఘటన కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు.. ఇది బంధాల విలువను, తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవాన్ని, మనసులోని బాధను తెలియజేస్తుంది. సాధారణంగా సమాధులు కాలగర్భంలో మిగిలిపోతాయి. కానీ శిబు మాత్రం తండ్రి జ్ఞాపకాన్ని తన తల్లి పక్కన నిలబెట్టాడు. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, ఆధునిక జీవనశైలి ఎంత దూరం తీసుకెళ్లినా.. కుటుంబ అనుబంధాలు శాశ్వతం. మరణం కూడా ఆ బంధాన్ని చెరపలేదని శిబు నిరూపించాడు. అతని పట్టుదల, తల్లిదండ్రులపై ప్రేమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Tags:    

Similar News