బాబుతో సోము వీర్రాజు...ఇంట్రెస్టింగ్ భేటీ !
అయితే మార్చిలో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు దాదాపు అయిదు నెలల తర్వాత తొలిసారి ఆ హోదాలో ముఖ్యమంత్రితో భేటీ కావడం విశేషం. బాబుకుని కలిసి అనేక విషయాలు చర్చించినట్లుగా సోము వీర్రాజు చెప్పారు.;
బీజేపీలో సీనియర్ నాయకుడు సోము వీర్రాజు. ఆయన ఈ మధ్యనే మరోసారి ఎమ్మెల్సీగా అయ్యారు. గతంలో ఒక మారు ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా సోము వీర్రాజు చెప్పారు. అయితే ఈ భేటీ ఇంట్రెస్టింగ్ గా ఉందనే అంటున్నారు.
ఎందుకలా అంటే :
గతంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా సోము వీర్రాజు ఉన్నపుడు టీడీపీని చంద్రబాబుని ఘాటుగానే విమర్శించేవారు. పైగా ఆయన వైసీపీకి కొంత అనుకూలుడు అన్న చర్చ అప్పట్లో వచ్చింది. అయితే బీజేపీని ఏపీలో సొంతంగా ఎదిగేందుకు తన వంతుగా కృషి చేయడంలో భాగంగానే ఆయన ఆ విధంగా వ్యవహరించారు అని చెప్పారు. అది వేరే సంగతి కానీ ఏపీలోని బీజేపీ నాయకులలో సోము వీర్రాజు తరహాలో బాబు మీద ఘాటైన విమర్శలు చేసిన వారు అయితే వేరొకరు లేరు అని అంటారు.
చిత్రంగా ఆయనకే సీటు :
అయితే ఇంత జరిగినా చిత్రంగా ఆయనకే ఎమ్మెల్సీ సీటు దక్కింది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే రాజకీయాల్లో ఇలాంటివి మామూలే అని కూడా అనుకున్నారు. ఆనాటి నుంచి సోము వీర్రాజు టోన్ కూడా మారింది. ఆయన చంద్రబాబుని పొగుడుతూ జగన్ మీద ఎవరూ చేయనంతగా విమర్శలు చేస్తున్నారు. ఈ విధంగా ఆయన ఎమ్మెల్సీగా తన దూకుడుని రాజకీయంగా చూపిస్తున్నారు.
తొలిసారి భేటీ :
అయితే మార్చిలో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు దాదాపు అయిదు నెలల తర్వాత తొలిసారి ఆ హోదాలో ముఖ్యమంత్రితో భేటీ కావడం విశేషం. బాబుకుని కలిసి అనేక విషయాలు చర్చించినట్లుగా సోము వీర్రాజు చెప్పారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగిందని ఆయన తెలియజేశారు.
ఏం చర్చించారంటే :
తూర్పు గోదావరి జిల్లాలో నీటి పారుదల సదుపాయాల మెరుగుదల, జాతీయ రహదారుల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, అలాగే గండి పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి వంటి అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని సోము వీర్రాజు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గండి పోచమ్మ తల్లి చిత్ర పటాన్ని అందజేశారు.
మళ్ళీ ఊహాగానాలు :
ఈ మధ్యకాలంలో సోము వీర్రాజు టీడీపీ అధినేత పట్ల పూర్తి సానుకూలతో ఉంటున్నారు. మిత్రపక్షం కాబట్టి అలాగే ఉండాలని అనుకోవడానికి ఆస్కారం ఉంది కానీ దానితో పాటుగా ఊహాగానాలు కూడా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. సోము వీర్రాజుకు మంత్రి మండలిలో స్థానం కల్పిస్తారు అని ఆయన సన్నిహితులు అయితే ఆశపడుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజుకి మంత్రి పదవి దక్కితే ఆయన రాజకీయ జీవితానికి అది ఒక ఘనమైన సార్ధకత అని అంటున్నారు. మరి బాబుతో గట్టిగా పెనవేసుకుంటున్న బంధం సోముకు ఉన్నత పదవి దక్కేలా చేస్తుందా అన్నది అయితే చూడాల్సి ఉంది.