తిరగబడిన స్పీడ్ బోటు.. గంగూలీ ఫ్యామిలీ ఎలా బతికి బట్టకట్టిందంటే?

మాజీ క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ సోదరుడు స్నేహాశీష్‌ గంగూలీ కుటుంబానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.;

Update: 2025-05-26 11:41 GMT

మాజీ క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ సోదరుడు స్నేహాశీష్‌ గంగూలీ కుటుంబానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒడిశాలోని పూరీ తీరంలో వారు ప్రయాణిస్తున్న స్పీడ్‌బోటు అకస్మాత్తుగా తిరగబడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అప్రమత్తమైన లైఫ్‌ గార్డ్స్‌ వెంటనే రంగంలోకి దిగి వారిని సురక్షితంగా రక్షించారు.

స్నేహాశీష్‌ గంగూలీ, ఆయన భార్య అర్పిత పూరీ బీచ్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ యాక్టివిటీలో పాల్గొంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బోటులో సరిపడా ప్రయాణికులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అర్పిత నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "సముద్రంలో అలల తీవ్రత అప్పటికే ఎక్కువగా ఉంది. సాధారణంగా ఒక్కో స్పీడ్‌బోటులో 10 మంది ప్రయాణికులు ఉండాలి. కానీ, ఇక్కడ ఎక్కువ డబ్బులకు ఆశపడి కేవలం ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే ఎక్కించుకుంటున్నారు. బోటు తేలికగా ఉండటంతో భారీ అలకు అది తిరగబడింది" అని ఆమె వివరించారు.

లైఫ్‌ గార్డ్స్‌ లేకపోయి ఉంటే ఈ రోజు తాము ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని అర్పిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బోట్లను నిర్వహించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు.

కాగా, సముద్రం నుంచి వీరిని రక్షిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News