సైబర్ సెక్యూరిటీ: ఎవరికీ భద్రత లేదా?

స్మార్ట్‌ఫోన్‌... నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అంతర్భాగం. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి.;

Update: 2025-06-21 12:30 GMT

స్మార్ట్‌ఫోన్‌... నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అంతర్భాగం. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ భద్రత గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. చాలామంది డేటా డిలీట్ చేస్తే ఏమీ కాదని భావిస్తారు, కానీ ఫోన్ ఐపీ అడ్రస్ ద్వారా మొత్తం సమాచారాన్ని తిరిగి పొందవచ్చని వారికి తెలియదు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ పరికరం మాత్రమే కాదు. అది బ్యాంకింగ్, సోషల్ మీడియా, షాపింగ్, ఆరోగ్యం, వినోదం, చదువు వంటి అనేక విభాగాలకు ద్వారంగా మారింది. ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతిలోనే ఉండే ఈ డివైస్ మన వ్యక్తిగత డేటా అంతటినీ అందులో భద్రపరిచినట్టు ఉంటుంది. కానీ దీనికి నిజంగా భద్రత ఉందా? అన్నదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

-ఎవరి ఫోన్‌కు భద్రత లేదు!

ఒక్క సామాన్యుడి ఫోన్ మాత్రమే కాదు; దేశాధినేతల ఫోన్‌లు కూడా సురక్షితంగా లేవన్న వాస్తవం తేలింది. పలు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ప్రముఖ రాజకీయ నాయకుల, ప్రముఖ వ్యాపారవేత్తల, జర్నలిస్టుల ఫోన్‌లు కూడా పేగసస్ వంటి స్పైవేర్ సాయంతో హ్యాక్ చేయబడ్డట్లు వెల్లడయ్యాయి. సామాన్యుడి ఫోన్ నుంచి దేశ అత్యంత కీలక నేత ఫోన్ వరకు ప్రమాదంలోనే ఉన్నాయి.

-డేటా విలువ ఎంతో తెలుసా?

"మన డేటాతో వాళ్లకి ఏమి చేస్తారు?" అనే ప్రశ్న చాలామంది అడుగుతారు. కానీ డేటా అనేది 21వ శతాబ్దపు పెట్రోల్. ఒక్క వ్యక్తి డేటా కాదు; లక్షల మంది డేటా గుంపులుగా డార్క్ నెట్‌లో అమ్ముడవుతున్నాయి. వ్యక్తిగత ప్రొఫైల్‌లు, కాంటాక్ట్‌లు, ఫోటోలు, మెసేజ్‌లు, లోకేషన్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, బ్రౌజింగ్ హిస్టరీ.. ఇవన్నీ డేటా బ్రోకర్లు కొనుగోలు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు, విదేశీ గూఢచార సంస్థలు, హ్యాకర్ గుంపులు వీటిని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

-భారత్ లో డేటా భద్రత పరిస్థితి

ఒక్క 2023 సంవత్సరంలోనే 1.8 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటా హ్యాక్‌కు గురైంది. గడచిన 20 ఏళ్లలో 10 సార్లు దేశవ్యాప్తంగా డేటా చోరీలు చోటు చేసుకున్నాయి. అమెరికా తర్వాత భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది డేటా లీకేజీల్లో. భారత్‌కు చెందిన ప్రభుత్వ సంస్థల, ప్రైవేట్ సంస్థల సర్వర్‌లు, ఫోన్‌లు, కంప్యూటర్‌లు ఎన్నో సైబర్ దాడులకు గురయ్యాయి.

- పబ్లిక్ వైఫై.. అపరిచిత ప్రమాదం

చిన్న కాఫీ షాపుల్లో, మాల్స్‌లో ఉచిత వైఫై అందుబాటులో ఉంటుంది. కానీ ఇవి ఎక్కువగా సైబర్ నేరగాళ్ల ముప్పులో ఉంటాయి. అన్‌సెక్యూర్డ్ నెట్‌వర్క్‌ల ద్వారా పాస్వర్డ్‌లు, బ్యాంక్ డీటెయిల్స్ లాంటి సున్నితమైన సమాచారం లీకవుతుంది. ఇదే విధంగా పబ్లిక్ కంప్యూటర్లు, షేర్డ్ ల్యాప్‌టాప్‌లు కూడా ప్రమాదమే.

- బ్లూటూత్, వాట్సాప్.. మరొకటి కాదు ముప్పే!

బ్లూటూత్ ఓపెన్‌గా ఉంటే అవతలి డివైస్‌లు కనెక్ట్ చేసి డేటా కొల్లగొట్టవచ్చు. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ ఫోన్ ఫిజికల్ యాక్సెస్ దొరికితే చాట్‌లు చూసే అవకాశం ఉంది. అలాగే వాట్సాప్ బ్యాకప్‌లు గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో ఉంటాయి; ఇవి ఎన్‌క్రిప్షన్ లేకుండా ఉండటంతో ప్రమాదం ఇంకాస్త పెరుగుతుంది.

ప్రాథమిక భద్రతా చర్యలు – ప్రతి ఒక్కరు పాటించాల్సిందే

టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) తప్పనిసరిగా పాటించాలి. నకిలీ లింక్స్‌పై క్లిక్ చేయకండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ ఉపయోగించండి. పాస్‌వర్డ్స్‌ను తరచూ మార్చండి. బ్లూటూత్, వైఫై అనవసరంగా ఆన్ పెట్టవద్దు. క్లౌడ్ బ్యాకప్‌లు ఎన్‌క్రిప్ట్ చేయండి దీనివల్ల డేటా సురక్షిగా ఉంటుంది.

డేటా అనేది నేడు వ్యక్తిగత ఆస్తి. ఇంటికి తాళం వేస్తాం, కారుకు సెక్యూరిటీ అలారమ్ పెడతాం... కానీ ఫోన్‌కు లేదా కంప్యూటర్‌కు ఎందుకు భద్రత అవసరం లేదు అని అనుకోవడం పెద్ద పొరపాటు. ప్రతి ఒక్కరూ సైబర్ హైజిన్ పాటించకపోతే, డేటా దోపిడీకి గురయ్యే అవకాశం మరింత పెరుగుతుంది. "మనకేం జరుగదు" అనే అపోహ వదిలి, ప్రతిసారి జాగ్రత్త పడటం ప్రారంభించాలి.

Tags:    

Similar News