మిథున్ రెడ్డికి ఝలక్..? హైకోర్టులో రేపు అత్యంత కీలకం
మద్యం కేసులో మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది.;
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సీఐడీ సిట్ ఝలక్ ఇచ్చింది. మద్యం కేసులో మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ తరఫున సీఐడీ అదనపు ఎస్పీ హైకోర్టులో ఏసీబీ కోర్టు తీర్పుపై అప్పీలు చేయగా, సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. దీంతో వైసీపీ కీలక నేత, రాజంపేట పార్లమెంటు సభ్యుడైన మిథున్ రెడ్డికి రేపు అత్యంత కీలకమైన రోజుగా చెబుతున్నారు.
మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఏ4 గా సిట్ పేర్కొంది. కేసులో అంతిమ లబ్ధిదారు తర్వాత స్థానం మిథున్ రెడ్డిదేనంటూ సిట్ ఆరోపిస్తూ వస్తోంది. ఆయనపై విచారణ కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. ఈ కారణంతో గత నెల 29న ఏసీబీ కోర్టు నిందితుడు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏసీబీ కోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వుల్లో చట్టబద్ధమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ సిట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
సిట్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 18న తొలుత మిథన్ రెడ్డి బెయిల్ పై విచారణ చేయగా, ఏసీబీ కోర్టు కొట్టివేసిందని, ఆ తర్వాత పది రోజులకే రెండోసారి బెయిలు పిటిషన్ దాఖలు చేశారని సిట్ తన పిటిషన్ లో తెలిపింది. తొలి బెయిలు పిటిషన్ కొట్టివేసిన అనంతరం పరిస్థితుల్లో మార్పు రాకుండా బెయిలు ఇవ్వకూడదనేది న్యాయసూత్రమని, దీన్ని పాటించకుండా మిథున్ రెడ్డికి ఏసీబ కోర్టు బెయిలు మంజూరు చేసింది. చార్జిషీటు దాఖలు చేశారని చెప్పి పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
దీనిని పరిగణనలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫమైంది. మిథున్ రెడ్డి నేరచరిత్ర గురించి పిటిషన్ లో ప్రస్తావించలేదు. ఈ ఒక్క కారణంతో బెయిలును కొట్టివేయవచ్చు. ఆర్థిక నేరాలు, తీవ్ర నేరాల కేసుల్లో నిందితులకు బెయిలు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మిథున్ రెడ్డికి బెయిలు మంజూరు విషయంలో ఏసీబీ కోర్టు పేర్కొన్న కారణాలు సేహేతుకంగా లేవు. చార్జిషీటు, అనుబంధ చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అసంపూర్తిగా ఉందనే కారణంతో నిందితులు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిలు మంజూరు చేసింది.
అందుకు భిన్నంగా చార్జిషీట్లు దాఖలు చేసినందున మిథున్ రెడ్డికి బెయిలు ఇస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. డీఫాల్ట్ బెయిలు మంజూరును సవాల్ చేస్తూ సీఐడీ వేసిన పిటిషనుపై వాదనలు ముగిసి, హైకోర్టు తీర్పురిజర్వు చేసింది. ఈ విషయాన్ని ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మిథున్ రెడ్డికి బెయిలు కొట్టివేయాలని సీఐడీ తన పిటిషన్ లో కోరింది.