కల్తీ నెయ్యి కేసు.. టీటీడీలో తొలి అరెస్టు
కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు చూపుతోంది. ఈ కేసులో ఇంతవరకు నెయ్యి సరఫరా చేసిన డెయిరీ డైరెక్టర్లు, డిస్టిబ్యూటర్లను అరెస్టు చేసిన సిట్ ఇప్పుడు టీటీడీపై ఫోకస్ చేసింది.;
కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు చూపుతోంది. ఈ కేసులో ఇంతవరకు నెయ్యి సరఫరా చేసిన డెయిరీ డైరెక్టర్లు, డిస్టిబ్యూటర్లను అరెస్టు చేసిన సిట్ ఇప్పుడు టీటీడీపై ఫోకస్ చేసింది. నెయ్యి ప్రొక్యూర్మెంట్ విభాగం జగనర్ మేనేజరుగా పనిచేసిన ఆర్ఎస్ఎస్వీ సుబ్రహ్మణ్యాన్ని తాజాగా అరెస్టు చేసింది. కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కల్తీనెయ్యి కేసులో అరెస్టు అయిన మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నతో సుబ్రహ్మణ్యానికి ఆర్థిక, బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు సీబీఐ సిట్ గుర్తించింది. 2022 ఏప్రిల్ లో జీఎంగా ఉన్న సుబ్రహ్మణ్యం నుంచి నిందితుడు చిన్నప్పన్న నెయ్యి సరఫరాకు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్లు సిట్ కోర్టుకు నివేదించింది. చిన్నప్పన్న నుంచి నాలుగైదు లక్షల రూపాయల వరకు సుబ్రహ్మణ్యం తీసుకున్నట్లు సిట్ ఆధారాలు సేకరించిందని అంటున్నారు. దీంతో అతడిని ఈ కేసులో ఏ29గా చేర్చారు.
ప్రొక్యూర్మెంట్ విభాగంలో జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో పనిచేస్తున్నారు. తిరుమల మాడవీధుల విధుల్లో ఉన్నారు. అయితే నిందితుడు చిన్నప్పన్నతో ఆయన సంబంధాలు వెలుగుచూసిన తర్వాత నెయ్యి కేసులో సుబ్రహ్మణ్యాన్ని నిందితుడిగా చేర్చారు. దీంతో గురువారం అతడిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడు సుబ్రహ్మణ్యాన్ని డిసెంబరు 10 వరకు రిమాండ్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితుడిని నెల్లూరు కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఏపీ పోలీసులు కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 28 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు టీటీడీ కిందస్థాయి సిబ్బంది పేర్లు కూడా ఉన్నాయి. అయితే వారిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. దీంతో మాజీ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్టును టీటీడీలో తొలిదిగా చెబుతున్నారు. ఈ అరెస్టులు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిందితుల్లో ఇప్పటివరకు 8 మందిని మాత్రమే సిట్ అరెస్టు చేసింది. నిందితుల జాబితాలో కొన్ని సంస్థలు ఉన్నాయి. కొన్నాళ్లుగా సిట్ అరెస్టులు నిలిపివేసింది. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను ఈ నెలలో అరెస్టు చేసింది. ఆ తర్వాత దర్యాప్తులో పురోగతి కనిపిస్తోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీలో మరిన్ని అరెస్టులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుందని అంటున్నారు. డిసెంబరు 15లోగా సుప్రీంకోర్టుకు తుది చార్జిషీటు దాఖలు చేయాలన్న టార్గెట్ తో సిట్ అడుగులు వేస్తోంది. దీంతో నిందితుల్లో టెన్షన్ ఎక్కువవుతోందని అంటున్నారు. కాగా, 2019 నుంచి 2023 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యానికి నిందితుడు చిన్నప్పన్నతో మంచి సంబంధాలు ఉన్నాయని సిట్ చెబుతోంది. సుబ్రహ్మణ్యం నుంచి నెయ్యి సరఫరాదారులు, వారు ఎంతెంత పరిణామంలో నెయ్యి టీటీడీకి సమకూర్చుతున్నారన్న వివరాలను చిన్నప్పన్న తెలుసుకున్నట్లు సిట్ గుర్తించింది. అంతేకాకుండా భోలేబాబా డెయిరీ ప్రతినిధులకు సుబ్రహ్మణ్యమే ఫోన్ చేసి చిన్నఅప్పన్నతో మాట్లాడాలని సూచించినట్లు సిట్ ఆధారాలు సేకరించిందని అంటున్నారు. మరోవైపు కల్తీ నెయ్యి సరఫరా చేశారని తెలిసినా సుబ్రహ్మణ్యం మాట్లాడలేదని చెబుతున్నారు. ఈ పరిణామాలు అన్నీ ఆయనను వేలెత్తిచూపడంతో అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.