పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులకు సన్మానం
అయితే, ఈ విషాదకర ఘటనలో వెలుగులోకి వచ్చిన ఒక హృదయపూర్వక విషయం ఏమిటంటే...;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడటం ఇటీవల కలచివేసింది. ఈ ఘటన కేవలం సినీ, రాజకీయ వర్గాలనే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ విషాదకర ఘటనలో వెలుగులోకి వచ్చిన ఒక హృదయపూర్వక విషయం ఏమిటంటే, సింగపూర్‌లోని భారతీయ వలస కార్మికులు మార్క్‌ను , ఇతర పిల్లలను కాపాడటంలో చూపిన అసామాన్య ధైర్యం ప్రదర్శించారు.
మార్క్ , అతని తల్లి అన్న లెజ్నేవాతో కలిసి వేసవి కోర్సుల కోసం సింగపూర్‌కు వెళ్లారు. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని రివర్ వ్యాలీ రోడ్‌లోని ఒక మూడు అంతస్తుల భవనంలో ఈ కోర్సులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 8న ఉదయం, ఆ భవనంలో అనుకోకుండా మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో కొందరు భారతీయ వలస కార్మికులు ఆ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. భవనం నుండి దట్టమైన పొగలు రావడం , పిల్లల ఆర్తనాదాలు వినడంతో, నలుగురు కార్మికులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు మండుతున్న భవనంలోకి దూసుకెళ్లి లోపల చిక్కుకున్న అనేక మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రక్షించబడిన వారిలో మార్క్ శంకర్ కూడా ఉన్నాడు.
దురదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న ఒక చిన్నారి మృతి చెందింది. మార్క్‌తో పాటు మరో 15 మంది పిల్లలు , ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు. భారతీయ కార్మికులు తక్షణమే స్పందించడం వల్లే ఒక పెద్ద విషాదం తప్పిందని అధికారులు తరువాత నిర్ధారించారు.
ఈ ఘటనపై సింగపూర్ అధికారులు విచారణ జరిపారు. విచారణలో ప్రమాద సమయంలో భారతీయ కార్మికులు చూపిన సాహసం మరియు వారి కీలక పాత్ర గురించి తెలుసుకున్నారు. వారి ధైర్యసాహసాలు నిస్వార్థ సేవకు ముగ్ధులైన సింగపూర్ ప్రభుత్వం, ఆ నలుగురు వలస కార్మికులను వారి వీరోచిత చర్యలకు అధికారికంగా సత్కరించింది.
ఈ సంఘటన భారతీయ వలస కార్మికుల మానవత్వాన్ని ధైర్యాన్ని చాటిచెబుతోంది. ప్రాణాలకు తెగించి పిల్లలను రక్షించిన వారిని స్మరించుకోవడం.. వారిని గౌరవించడం మనందరి బాధ్యత. మార్క్ శంకర్ త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆశిద్దాం.