జీవితకాల గరిష్ఠం: కేజీ వెండి రూ.లక్ష

ఓవైపు బంగారం.. మరోవైపు వెండి ఆకాశమే హద్దు అన్నట్లుగా ధరలు దూసుకెళుతున్నాయి

Update: 2024-05-21 05:29 GMT

ఓవైపు బంగారం.. మరోవైపు వెండి ఆకాశమే హద్దు అన్నట్లుగా ధరలు దూసుకెళుతున్నాయి. గడిచిన కొంతకాలంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతుందని.. జీవితకాల గరిష్ఠమైన రూ.లక్ష మార్కును దాటేస్తుందన్న అంచనాలు జోరుగా సాగుతున్నాయి. అందుకు తగ్గట్లే.. తాజాగా కేజీ వెండి లక్ష రూపాయిల మార్కును దాటేసింది. దీంతో.. అంతో ఇంతో అందుబాటులో ఉంటుందని భావించే వెండి ధర కూడా కొండకెక్కి కూర్చోవటం ఇబ్బందికరమని చెప్పక తప్పదు.

వెండి ధర ఇలా ఉంటే.. బంగారం సైతం భారీగా పెరిగింది. సోమవారం బంగారం పది గ్రాముల 24 క్యారెట్లు రూ.75,160కు చేరుకుంది. సోమవారం ఒక్కరోజులోనే వెండి ధర కేజీకి రూ.4500 పెరగటం విశేషం. కేజీ వెండి ఇప్పుడు రూ.1,01,000కు చేరుకుంది. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే వీలుందని చెబుతున్నారు. ఈ మధ్యన బంగారం ధర కూడా పదిగ్రాములు రూ.లక్ష మార్కుకు చేరుకునే రోజు దగ్గర్లోనే ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే.. బంగారం ధర తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగింది. ఇంతకూ బంగారం.. వెండి ధరలు ఇంతలా ఎందుకు మండిపోతున్నాయి? దానికి కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

కీలకమైన బ్యాంక్ వడ్డీ రేట్లు బంగారం ధరల్ని డిసైడ్ చేస్తుంటాయని చెప్పాలి. సాధారణంగా ఫెడ్ రేట్లు పెరిగే సమయంలో స్థిర ఆదాయాన్ని పంచే బాండ్లు.. మార్కెట్ ఫండ్స్ కు డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో విలువైన లోహాల మీద పెట్టే పెట్టుబడులు వాటి నుంచి మార్కెట్ ఫండ్స్ మీదకు మళ్లుతుంది. అదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గే సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాలైన బంగారం.. వెండి మీద పెట్టుబడులు పెట్టేస్తుంటాయి.దీంతో.. ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.

Read more!

- అమెరికాలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గటం. ఫెడ్ రేట్ల తగ్గింపు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు.

- ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వు కనీసం రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే వీలుందన్న ఊహాగానాలు

- తాజాగాచోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు

- అమెరికాతో పాటు మిగిలిన దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం త్వరలో వడ్డీరేట్లను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు రావటం.

Tags:    

Similar News