డీకే కేబినెట్ లో నో డిప్యూటీ సీఎం ?
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఈ నెల 3న కొలువు తీరనుంది. డీకే శివ కుమార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఈ నెల 3న కొలువు తీరనుంది. డీకే శివ కుమార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే డీకే కేబినెట్ లో కనీసంగా నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని మాజీ సీఎం సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు. కానీ మంత్రులుగా సిద్ధ రామయ్య వర్గం నుంచి ఎవరికి తీసుకున్నా ఓకే కానీ ఉప ముఖ్యమంత్రుల పదవులు వద్దే వద్దు అన్నది డీకే ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం మాజీ సీఎం సిద్ధరామయ్య కాబోయే సీఎం డీకే శివ కుమార్ ఇద్దరూ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వంలో కేబినెట్ కూర్ప్పు మీద సీరియస్ గానే చర్చలు జరుపుతున్నారు అని తెలుస్తోంది.
పవర్ సెంటర్లుగానే :
ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది రాజ్యాంగ బద్ధమైనది కాకపోయినప్పటికీ రాజకీయంగా చూస్తే ప్రాధాన్యత కలిగినది అని గుర్తు చేస్తున్నారు. పైగా ఉప ముఖ్యమంత్రి పదవులు అనగానే అవి పవర్ సెంటర్లుగా మారుతున్నాయన్న ఆందోళన డీకే వర్గంలో ఉంది. నిజానికి చూస్తే డీకే ఉప ముఖ్యమంత్రిగా గడచిన మూడేళ్ల కాలం పనిచేశారు. అయితే ఆయనకు సీఎం హామీ ఉంది కాబట్టి అలాంటి ఫార్ములా కుదిరింది. కానీ తన మంత్రివర్గంలో మాత్రం ఉప ముఖ్యమంత్రి చాన్సే లేదని డీకే స్పష్టం చేయదలచారు అని అంటున్నారు. దాని వల్ల రాజకీయంగా ఇబ్బందులు తప్ప మరేమీ లేదని కూడా ఆయన వర్గం గట్టిగాబ్న భావిస్తోంది.
పట్టుబడుతున్న సిద్ధరామయ్య :
అయితే ఉప ముఖ్యమంత్రులుగా తన వర్గం వారికి కనీసం నలుగురుకికి చాన్స్ ఇవ్వాలని అధినాయకత్వం వద్ద మాజీ సీఎం సిద్ధరామయ్య పట్టుబడుతున్నారని అంటున్నారు. జీ పరమేశ్వర, జమీర్ అహ్మద్ ఖాన్, కేజే జార్జ్, ఎంపీ పాటిల్ లకు డిప్యూటీ సీఎం పోస్టులు ఇవ్వాల్సిందే అని సిద్ధ రామయ్య గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లుగా భోగట్టా. వీరంతా అహిందా వర్గానికి చెందిన వారు. అంతే కాదు అహిందా వర్గానికి చెందిన వారికి అత్యంత ప్రాధాన్యత కలిగిన మంత్రి పదవులు ఇవ్వాలని కూడా సిద్ధ రామయ్య కోరుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే మొత్తం కర్ణాటక మంత్రివర్గంలో 35 మంది దాకా తీసుకోవచ్చు. ఇందులో సిద్ధరామయ్య వర్గానికి పది మందికి మాత్రమే కేబినెట్ లో చోటు కల్పించి ఆ కోటాను అంతవరకే ఉంచాలని కాంగ్రెస్ అధినాయకత్వం చూస్తోంది అని అంటున్నారు.
డీకే కి పూర్తి స్వేచ్చ :
డీకే శివకుమార్ కి పూర్తి స్వేచ్చ ఇవ్వాలని ఆయన సీఎం గా సజావుగా పనిచేసుకునేలా కేబినెట్ లో కూర్పు ఉండాలని కూడా కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు. ఇక సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించాలని ఆయనను రాష్ట్ర రాజకీయాల నుంచి ఢిల్లీకి తీసుకుని రావాలని కాంగ్రెస్ అగ్ర నేతలు చూస్తున్నారు. దానికి సిద్ధరామయ్య అయితే ససేమిరా అని అంటున్నట్లుగా చెబుతున్నారు. తాను ఎమ్మెల్యేగానే రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతాను అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక ఆయన సతీమణి పార్వతికి రాజ్యసభ ఇస్తామన్నా కూడా సిద్ధరామయ్య అంగీకరించడం లేదని అంటున్నారు. ఆమెకు రాజకీయాల పట్ల పరిచయం లేదని ఆసక్తి కూడా లేదని చెబుతున్నారని అంటున్నారు. అయితే సిద్ధరామయ్య కుమారుడు యతేంద్రకు డీకే కేబినెట్ లో చోటు కల్పించేందుకు హై కమాండ్ ఓకే చెప్పిందని కూడా ప్రచారం సాగుతోంది.
మొత్తం మీద చూస్తే ఇరవై మంది మంత్రులతో డీకే బుధవారం ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. మిగిలిన 15 మంది మంత్రుల ఖాళీలను విడతల వారీగా భర్తీ చేసుకుంటారని తెలుస్తోంది.