ఐఎస్‌ఎస్‌కు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.. ఏడు కీలక ప్రయోగాలు!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS)కి చేపట్టబోయే ఆక్సియమ్‌-4 మిషన్ కోసం భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా ప్రధాన వ్యోమగామిగా ఎంపికయ్యారు;

Update: 2025-04-21 17:02 GMT

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS)కి చేపట్టబోయే ఆక్సియమ్‌-4 మిషన్ కోసం భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా ప్రధాన వ్యోమగామిగా ఎంపికయ్యారు. భారత్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో భాగంగా మే నెలలో ఆయన ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌లో శుభాంశు శుక్లా కనీసం ఏడు కీలక ప్రయోగాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

-ప్రయోగాల్లో ప్రధానమైనవి:

శుభాంశు చేపట్టనున్న ప్రయోగాల్లో అంతరిక్షంలో పంట సాగుతో పాటు, అత్యంత అరుదైన సూక్ష్మజీవి 'టార్డిగ్రేడ్' లేదా 'నీటి ఎలుగుబంటి'పై అధ్యయనం ప్రధానమైనవి.

- టార్డిగ్రేడ్ అధ్యయనం

0.3 మి.మీల నుంచి 0.5 మి.మీల పొడవు ఉండే టార్డిగ్రేడ్, భూమిపై అత్యంత కఠినమైన పర్యావరణ పరిస్థితులను సైతం తట్టుకుని జీవించగల అరుదైన డీఎన్‌ఏను కలిగి ఉంటుంది. ఇస్రో ఇప్పటికే ఈ జీవి డీఎన్‌ఏను డీకోడ్ చేసింది. అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో దీని పునరుత్పత్తిని, భూమి, అంతరిక్షంలో జరిగే జన్యు మార్పిడిని అధ్యయనం చేస్తారు. తీవ్రమైన సూర్యరశ్మి, గురుత్వాకర్షణ వంటి పరిస్థితుల్లో ఈ జీవి డీఎన్‌ఏలో కలిగే మార్పులను పరిశీలించడం ద్వారా భవిష్యత్ వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ అధ్యయనం త్వరలో ప్రయోగించనున్న మానవసహిత 'గగన్‌యాన్‌' మిషన్‌కు కూడా ఎంతో ఉపయోగపడనుందని ఇస్రో అంచనా వేస్తోంది.

- కంప్యూటర్ స్క్రీన్ల వాడకంపై పరిశోధన:

అంతరిక్షంలో కంప్యూటర్ స్క్రీన్‌లను ఉపయోగించడం వల్ల వ్యోమగాములపై కలిగే మార్పులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మైక్రోగ్రావిటీలో కంటి చూపును ఒకే చోట నిలపడం (గేజ్ ఫిక్సేషన్), వేగంగా కంటిని కదిలించడం వల్ల వ్యోమగాములలో ఒత్తిడి స్థాయులు ఎలా ఉంటాయో పరిశీలిస్తారు. ఈ అధ్యయన ఫలితాలు భవిష్యత్ అంతరిక్ష నౌకల్లో కంప్యూటర్ల రూపకల్పనకు మార్గనిర్దేశం చేస్తాయి. ఈ విధంగా మొత్తం ఏడు వేర్వేరు పరిశోధనలను గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌లో చేపట్టనున్నారు.

- గగన్‌యాన్‌కు ముందు..

కాగా, భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్‌'కు ముందుగానే ఒక భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించడం కీలక పరిణామం. గగన్‌యాన్‌ మిషన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా అతిపిన్న వయస్కుడు కావడం గమనార్హం. ఈ ISS యాత్ర ద్వారా లభించే అనుభవం, పరిశోధనా ఫలితాలు భవిష్యత్‌లో భారత అంతరిక్ష కార్యక్రమాలకు, ముఖ్యంగా గగన్‌యాన్‌ విజయానికి ఎంతగానో దోహదపడతాయి.

Tags:    

Similar News