షర్మిల సంచలనం: చెల్లెళ్ల కంటే భార్య బంధువులే ఎక్కువా అన్నా?

వివేకా సతీమణి సౌభాగ్యమ్మతో కలిసి పులివెందుల ర్యాలీలో పాల్గొన్న షర్మిల.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2024-05-10 06:39 GMT

గడిచిన కొద్ది రోజులుగా తన అన్న కం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్ షర్మిల.. తాజాగా మరో కొత్త చర్చకు తెర తీశారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ సతీమణి.. తన వదిన భారతిపై ఆమె విమర్శ బాణాన్ని ఎక్కు పెట్టారు. వివేకా సతీమణి సౌభాగ్యమ్మతో కలిసి పులివెందుల ర్యాలీలో పాల్గొన్న షర్మిల.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘‘జగనన్నా.. నీకు చెల్లెళ్ల కంటే భార్య తరఫు బంధువులు ఎక్కువయ్యారా? వివేకా కంటే అవినాష్ రెడ్డి ఎక్కువా? అంతలా అవినాష్ ను కాపాడటానికి కారణమేంటి?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకప్పుడు తాను అన్న కోసం ఇల్లు.. వాకిలి వదిలిపెట్టి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గుర్తు చేసిన షర్మిల... ‘‘కడప ఎన్నికల్లో వైఎస్సార్ బిడ్డ ఒకవైపు.. వివేకా హత్య కేసు నిందితుడు మరోవైపు పోటీ పడుతున్నారు. వివేకా హత్యకేసులో ప్రజాకోర్టులో న్యాయం కోసం కొంగుచాచి అడుగుతున్నా. ఈ కేసులో ఎంపీ అవినాష్ ను కాపాడటమే కాదు.. ఆయనకే టికెట్ ఇచ్చారు’’ అంటూ మండిపడ్డారు.

వివేకాకు కొడుకుల్లేరని.. జగన్ ను కొడుకుగా చూసుకున్నారన్న షర్మిల.. ‘‘బాబాయ్ ను చంపిన నిందితులనే జగన్ కాపాడుతున్నారు. అవినాష్ నిర్దోషి అని జగన్ నమ్ముతున్నారట. ఆయన నమ్మితే ప్రపంచమంతా నమ్మాలా? ఓటుతో పులివెందుల ప్రజలు తమ ప్రేమను కురిపిస్తారని నమ్ముతున్నా. వివేకా కంటే అవినాష్ రెడ్డే ఎక్కువా? అంతలా అవినాష్ ను కాపాడటానికి కారణమేంటన్న ప్రశ్నల్ని సంధించారు.

ఈ ర్యాలీలో మాట్లాడిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత మాట్లాడుతూ.. వివేకా హత్య కేసు విషయంలో న్యాయం కోసం పోరాడుతున్నామని.. ఈ పోరులో కోర్టు తీర్పు చాలా ఆలస్యమవుతుందన్నారు. కోర్టు తీర్పు కంటే ప్రజాతీర్పు చాలా పెద్దదన్న ఆమె.. ‘ప్రజాతీర్పు కోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారు. అవినాష్ కు ఓటు అడిగే హక్కు లేదు. ఆయన రేపో.. మాపో జైలుకు వెళతారు. ఇలాంటివారికి ఓటు వేయటం అవసరమా?’’ అని ప్రశ్నించారు. ఇప్పటివరకు గీత దాటని షర్మిల.. తాజా ప్రచారంతో నేరుగా తన అన్న పైనా.. వదినపైనా విమర్శల బాణాల్ని సంధించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

Tags:    

Similar News