సీఎం జగన్.. అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు

అయితే.. వైసీపీ బీజేపీకి బీ టీం కాదని.. ఆ పార్టీ బీజేపీలోనే ఉందంటూ మాటల చమత్కారాన్ని ప్రదర్శించారు.;

Update: 2024-02-29 04:39 GMT

మారిన కాలానికి తగ్గట్లు వైఎస్ షర్మిలా రెడ్డి తన విమర్శలకు పదును పెంచుతున్నారు. సోదరుడి మీద యుద్ధం చేస్తున్న ఆమె.. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. సీఎం జగన్.. బీజేపీ నేతగా ఆమె అభివర్ణించారు. వైసీపీని అందరూ బీజేపీ ‘బీ’ టీంగా అభివర్ణిస్తున్నారని పేర్కొన్నారు. అయితే.. వైసీపీ బీజేపీకి బీ టీం కాదని.. ఆ పార్టీ బీజేపీలోనే ఉందంటూ మాటల చమత్కారాన్ని ప్రదర్శించారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టార్గెట్ మోడీ.. టార్గెట్ బ్రదర్.. అన్నట్లుగా ఆమె అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా 2014 ఎన్నికల వేళలో.. నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న నరేంద్ర మోడీ.. ఏపీకి పత్యేక హోదా ఇస్తానంటూ తిరుపతి సభలో తొలిసారి ప్రకటించటం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న ఆమె.. ఎక్కడైతే ఏపీకి హోదా హామీని మోడీ ఇచ్చారో.. అదే తిరుపతిలో శుక్రవారం ‘ప్రత్యేక హోదా డిక్లరేషన్’ పేరిట బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.

ఏపీ ప్రత్యేక హోదాను సాధించని కారణంగా రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేవ్ పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లుగా ఆమె మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ఇదే తీరు కొనసాగితే.. ఏపీలో యువత కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి డెవలప్ మెంట్ సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి హోదా అన్నది సంజీవినిగా ఆమె అభివర్ణించారు. రాజకీయం కోసం ప్రత్యేక హోదాను జగన్ వాడుకున్నారన్న ఆమె.. ‘‘ప్రతిపక్షంలో ఉండగా జగన్.. దీక్షలు చేశారు. మూకుమ్మడిగా లోక్ సభ సభ్యులు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు?’’ అంటూ ప్రశ్నించారు.

అటు చంద్రబాబు.. ఇటు జగన్ ఇద్దరూ కూడా ప్రత్యేక హోదా పేరుతో రాజకీయం చేశారన్నారు. దేశరాజధాని ఢిల్లీని తలపించేలా రాజధానిని ఇస్తానని మోడీ హామీ ఇచ్చారన్నారు. కానీ.. ఆ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 2వేల పరిశ్రమలు వచ్చాయని.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుమని పది పరిశ్రమలు కూడా రాలేదంటూ మండిపడ్డారు. ఏపీకి 972 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని.. వాటి ఆధారిత పరిశ్రమలు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీని హార్డ్ వేర్ హబ్ చేస్తామన్న మోడీ ప్రకటన వాస్తవంలో అదేమీ జరగలేదన్నారు.

జగన్ బీజేపీ నాయకుడు కాబట్టే.. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయటం లేదంటూ కొత్త సంచలనానికి తెర తీశారు. జగన్ పాలనలో లిక్కర్.. శాండ్.. మైనింగ్ మాఫియా పెట్రేగిపోతున్నాయని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం జగన్ ను ఇంత నేరుగా.. ఈ తరహాలో టార్గెట్ చేయేలేదన్న మాట వినిపిస్తోంది.


Full View


Tags:    

Similar News