ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి.. ఇంత‌లోనే విన‌కూడ‌ని వార్త‌

ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి. అంత‌లోనే నిర్భంధించారనే వార్త‌. క్షేమంగా వ‌స్తోడో రాడో తెలియ‌దు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ఓ కుటుంబ గాథ ఇది.;

Update: 2026-01-12 09:40 GMT

ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి. అంత‌లోనే నిర్భంధించారనే వార్త‌. క్షేమంగా వ‌స్తోడో రాడో తెలియ‌దు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ఓ కుటుంబ గాథ ఇది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని పాలంపూర్ కు చెందిన రిక్షిత్ చౌహాన్ ర‌ష్యా సంస్థ‌లో మ‌ర్చెంట్ నేవీ ఆఫీస‌ర్ గా ప‌నిచేస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఆయ‌న వివాహం నిశ్చ‌య‌మైంది. డ్యూటీలో భాగంగా వెనుజులా వెళ్లారు. అంత‌లోనే అమెరికా వెనుజులాను త‌మ ఆధీనంలోకి తీసుకుంది. అదే స‌మ‌యంలో ర‌ష్యా జెండాతో ఉన్న మ్యారినెరా నౌక‌ను సీజ్ చేసింది. ఆ నౌక‌లోనే రిక్షిత్ చౌహాన్ ఉన్నారు. రిక్షిత్ తోపాటు మ‌రో ఇద్ద‌రు భార‌తీయలు ఉన్నారు. ర‌ష్యా సంస్థ‌లో చేరాక మొద‌టి సారి రిక్షిత్ ను స‌ముద్రం మీద‌కు పంపిన‌ట్టు తెలుస్తోంది. రిక్షిత్ ను సుర‌క్షితంగా తీసుకురావాల‌ని అత‌ని కుటుంబం ప్ర‌ధాని మోదీని కోరింది. ఫిబ్ర‌వ‌రి 19న త‌న కొడుకు పెళ్లి నిశ్చ‌య‌మైన‌ట్టు తెలిపారు.

2025లో త‌న కుమారుడు రిక్షిత్ ర‌ష్యా సంస్థ‌లో చేరిన‌ట్టు ..రిక్షిత్ త‌ల్లిదండ్రులు తెలిపారు. వెనుజులాపై అమెరికా సైనిక చ‌ర్య నేప‌థ్యంలో తిరిగి రావాల‌ని ర‌ష్యా సంస్థ చెప్పిన‌ట్టు త‌మ‌తో చెప్పాడ‌ని పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 10న త‌మ కుమారుడు ఉన్న షిప్ సీజ్ అయిన‌ట్టు తెలిసింద‌ని రిక్షిత్ త‌ల్లిదండ్రులు వెల్లడించారు. దీనిపై భార‌త విదేశాంగ శాఖ స్పందించింది. ఆ షిప్ లో ఉన్న భారతీయుల వివ‌రాల‌ను నిర్ధారించే ప్ర‌య‌త్నం చేస్తోంది. షిప్ లో 28 మంది ఉండ‌గా వారిలో ఉక్రెయిన్, ర‌ష్యా, జార్జియా పౌరులు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ర‌ష్యా త‌మ సిబ్బందికి ఎలాంటి హాని క‌ల‌గ‌జేయొద్దంటూ అమెరికాను కోరిన‌ట్టు తెలుస్తోంది. అమెరికా కూడా అందుకు అంగీక‌రించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వెనుజులాపై అమెరికా సైనిక చ‌ర్య‌పై ర‌ష్యా పెద్ద‌గా స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. త‌మ ప్రాధాన్య‌త ఉక్రెయిన్ నే అన్న‌ట్టు వ్య‌వ‌హరిస్తోంది. ట్రంప్ త‌మ‌కు వ్య‌తిరేకంగా మార‌కుండా ఉంచేందుకు ర‌ష్యా య‌త్నిస్తోంది. అందుకే త‌మ షిప్ ను అమెరికా స్వాధీనం చేసుకున్నా పెద్ద‌గా స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. సాధార‌ణంగా అయితే అమెరికా ర‌ష్యా షిప్ స్వాధీనం చేసుకోవ‌డం తీవ్ర‌స్థాయిలో స్పందించే అంశం. కానీ ఉక్రెయిన్ తో జ‌రుగుతున్న యుద్ధం నేప‌థ్యంలో అమెరికాతో ర‌ష్యా వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Tags:    

Similar News