షర్మిళ చూపు కొడంగల్ వైపు... రేవంత్ పై రివేంజ్?
కొడంగల్ లో సామాజిక సమీకరణలు తనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్న షర్మిల.. ఇప్పటికే అక్కడ సర్వేలు చేయిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో రాజకీయాలు ఎవరి ఊహకూ అందనంత రసవత్తరంగా సాగుతున్నాయని, సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయని, ఈ సమయంలో షర్మిళ రాజకీయలు మరొకెత్తుగా ఉన్నాయని అంటున్నారు. పైగా ఇప్పుడు షర్మిళ ఆగ్రహం బీఆరెస్స్ పై కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డిపై ఉందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో షర్మిళకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పి వైఎస్సార్టీపీని స్థాపించారు వైఎస్ షర్మిళ. అనంతరం పాదయాత్ర చేశారు. ముఖ్యంగా టీఎస్పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజ్ సమయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు కక్కారు. టీఎస్పీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా బలమైన పోరాటం చేశారు. బలంగా తన వాయిస్ వినిపించారు. ఈ సమయంలో అరెస్టుల పర్వాలు కూడా నడిచాయి.
ఇంతలో ఏమైందో ఏమోకానీ.. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ వద్ద ప్రత్యక్షమయ్యారు షర్మిళ. దీంతో... వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రతిపాదన వచ్చిందనే కామెంట్లు వినిపించాయి. మరోపక్క కాంగ్రెస్ తో పొత్తుకోసం షర్మిల ప్రయత్నిస్తున్నారనే మాటలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు షర్మిళకు మధ్య అడ్డుగా రేవంత్ రెడ్డి నిలిచారనే చర్చ జరిగింది.
కట్ చేస్తే... తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిళ ప్రకటించారు. ఇందులో భాగంగా తాను మాత్రం ముందుగా ప్రకటించినట్లుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో షర్మిళ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని భావిస్తున్నారన్ని అంటున్నారు.
ఇందులో భాగంగా... ఆమె రెండో స్థానంగా కొడంగల్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. తాను తెలంగాణ రాజకీయాలకే కన్ ఫైన్ అవుతానని కాంగ్రెస్ అధిష్టాణం ముందు షర్మిళ చెప్పారని, అయితే ఈ విషయంలో రేవంత్ & కో షర్మిళ రాకను శాయశక్తులా అడ్డుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ కు కొడంగల్ లోనే షాక్ ఇవ్వాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొడంగల్ లో సామాజిక సమీకరణలు తనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్న షర్మిల.. ఇప్పటికే అక్కడ సర్వేలు చేయిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కొడంగల్ లో పాదయాత్ర చేసిన సమయంలోనూ రేవంత్ ను టార్గెట్ చేశారు షర్మిల. పైగా ఇప్పుడు కాంగ్రెస్ కు తనకూ మధ్య రేవంత్ అడ్డుగా వచ్చాడనే గ్రెడ్జ్ ఆమెకు ఫుల్ గా ఉందని అంటున్నారు.
దీంతో... సర్వే ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా ఉన్నా షర్మిల కొండగల్ లో కూడా బరిలోకి దిగుతారని అంటున్నారు. ప్రస్తుతం కొడంగల్ లో బీఆరెస్స్ అభ్యర్ది పట్నం నరేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నారు. రేవంత్ కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్న నేపథ్యంలో... షర్మిళ ఎంటరైతే సమీకరణలు పూర్తిగా మారిపోతాయని అంటున్నారు.
ఇందులో భాగంగా రెడ్డి సామాజిక వర్గ ఓట్ల సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాత్రం పూర్తిగా చీలే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఫలితంగా షర్మిళ గెలవకపోయినా... రేవంత్ ను మాత్రం ఓడించే అవకాశాలున్నాయనే చర్చ కూడా సాగుతుండటం గమనార్హం. మరి సర్వే ఫలితాలు కాస్త అనుకూలంగా వస్తే.. షర్మిళ కొండంగల్ లో కూడా బరిలోకి దిగితే... రాజకీయాలు ఎలా వేడెక్కుతాయనేది వేచి చూడాలి.