సింగిల్ సీటు లేకుండా ఏపీలో బీజేపీ రూలింగ్!
ఏపీ రాజకీయాలు ఇంతకాలం ద్విముఖ పోరుగా సాగుతున్న వేళ షర్మిల ఎంట్రీతో లెక్కలు మారిపోయాయని అంటున్నారు పరిశీలకులు.;
ఏపీ రాజకీయాలు ఇంతకాలం ద్విముఖ పోరుగా సాగుతున్న వేళ షర్మిల ఎంట్రీతో లెక్కలు మారిపోయాయని అంటున్నారు పరిశీలకులు. నిన్నమొన్నటివరకూ అయితే వైసీపీ.. కాకపోతే టీడీపీ + జనసేన అనే మాటలు మాత్రమే వినిపించేవని చెబుతున్నారు. అయితే... ఏపీపీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ తాను ప్రదర్శిస్తున్న దూకుడుతో... పార్టీలో టిక్కెట్లు దొరకని అసంతృప్తులకు కాంగ్రెస్ ఒక ఆప్షన్ లా మారేలా ఆమె చేశారని అంటున్నారు.
ఇక పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచీ ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ లపై షర్మిల నిప్పులు కక్కుతున్నారు! ఈ గ్యాప్ లో అప్పుడప్పుడూ టీడీపీపై సున్నితంగా స్పందిస్తున్నప్పటికీ... ప్రధానంగా... బీజేపీ - వైసీపీలపై ఫైరవుతున్నారు. ప్రత్యేకహోదా పేరు చెప్పి ఆమె రెండు పార్టీలపైనా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఏపీలో బీజేపీని అడ్డుపెట్టి అటు వైసీపీ, ఇటు టీడీపీ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
అవును... ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజు నుంచి బీజేపీకి వైసీపీ, టీడీపీలు బానిసగా మారాయని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ చేతిలో టీడీపీ, వైసీపీలు ఆటబొమ్మలుగా మారాయన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో... తాజా సమావేశంలో ఆమె మరోసారి విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ సీటు లేకపోయినా ఏపీలో బీజేపీ పాలన సాగిస్తుందని అన్నారు షర్మిళ.
ఇందులో భాగంగా గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ, ఒక్క ఎంపీ సీటు గానీ ప్రజలు ఇవ్వలేదని.. అయితే... వారికి అధికారాన్ని మాత్రం ఏపీ పార్టీలు ఇచ్చేశాయని.. ఇందులో భాగంగా ఇక్కడున్న రెండు ప్రాంతీయ పార్టీలు (వైసీపీ - టీడీపీ)లు బీజేపీకి బానిసలుగా మారారని ఆమె ఫైరయ్యారు. ఈ విషయాలను ఏపీ ప్రజలు గ్రహించాలని.. ఈ రెండు బానిస పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఇక ఏపీ రాజకీయాల్లోకి తన ప్రవేశంపై స్పందించిన షర్మిల... ఇది తన పుట్టిల్లు అని.. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతోందని.. ఇక్కడి ప్రజల హక్కులు హరిస్తున్నారని.. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి ఈ వైఎస్సార్ బిడ్డ అడుగుపెట్టిందని చెప్పుకొచ్చారు.