షర్మిల ఆశావాదం...ఏపీలో కాంగ్రెస్ అలా !

నాయకులలో ఆ మాత్రం ధీమా లేకపోతే నడిపించడం కష్టం. కానీ అది ధీమా కాకుండా అతి ధీమా అయితేనే ప్రమాదం.;

Update: 2025-04-09 16:23 GMT

నాయకులలో ఆ మాత్రం ధీమా లేకపోతే నడిపించడం కష్టం. కానీ అది ధీమా కాకుండా అతి ధీమా అయితేనే ప్రమాదం. ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అయితే పూర్తి ఆశావాదంతో ఉంటూనే కాస్తా ఎక్కువగానే ఊహించుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో కాంగ్రెస్ ఎదుగుతోందని అందుకే తమ పార్టీ మీద వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తాజాగా ఆమె ఆరోపించారు.

తమ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు అని కూడా అన్నారు. ఏపీలో తమ పార్టీ నుంచే నాయకులను వైసీపీ ఆశపెట్టి మరీ తీసుకుని పోతోంది అని ఘాటుగా విమర్శించారు. వైసీపీ నేతలకు ఎంతసేపూ అద్దంలో చంద్రబాబే కనిపిస్తున్నారు అని ఆమె విమర్శించారు. అందుకే కాంగ్రెస్ తో కలిపి కట్టి కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఏపీలో అసలు ప్రతిపక్షం ఉందా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఒక్కటే కూటమిని ఎదిరించి నిలబడిందని పోరాటం చేస్తోందని అన్నారు. ఏపీలో అన్ని పార్టీలూ ఎన్డీయేలో భాగమే అని అన్నారు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఆమె మరోసారి అన్నారు.

ఏపీలో అసలైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎదుగుతూంటే చూస్తూ ఓర్వలేకనే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆమె నిందించారు. ఇదిలా ఉంటే గుజరాత్ అహ్మదాబాద్ లో జరుగుతున్న ఏఐసీసీ కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అయితే షర్మిల ఆశలు ఆలోచనలు మంచివే అయినా ఏపీలో కాంగ్రెస్ బలంగా ఎదుగుతోందా అన్న చర్చ వస్తోంది. వైసీపీని వీక్ చేస్తేనే తప్ప కాంగ్రెస్ ఏపీలో ఎదగదు, అయితే వైసీపీ నుంచి నాయకులు కూటమిలోని పార్టీలలో చేరిపోతున్నారు తప్ప కాంగ్రెస్ వైపు చూడడం లేదు. షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పై దాటుతోంది

కానీ పార్టీలో పెద్దగా చలనం అయితే తేలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నా ఈ రోజుకీ సైలెంట్ గానే ఉన్నారు. మూడు మీడియా మీటింగ్స్ ఆరు ట్వీట్లతో పార్టీ బాగుందని అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఇక షర్మిల తన పార్టీని టీడీపీతో చంద్రబాబుతో జతకట్టి విమర్శలు చేయవద్దని వైసీపీ నేతలను కోరుతున్నారు

కానీ ఆ విధంగా వ్యహారంలో కనిపించాలి అని అంటున్నారు. ఎంతసేపూ జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం, కుటుంబ విషయాలను ఆస్తుల గొడవను మధ్యలోకి తీసుకుని రావడం వల్లనే కదా ఇదంతా అని ఆలోచించుకోవాల్సి ఉంది అని అంటున్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద సమర్ధవంతంగా విమర్శలు చేయాల్సి ఉందని అంటున్నారు.

పార్టీలోని నాయకులను కలుపుకుని పోవడంతో పాటు వామపక్షాల సహకారం తీసుకుని ఆందోళనలు చేయడం ద్వారా ఏపీలో ఇండియా కూటమిని బలంగా నిలబెడితే అపుడు ఆమె చెప్పినట్లుగా కచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎదుగుతుందని అంటున్నారు. నిజానికి ఏపీలో వైసీపీ అనుకున్న స్థాయిలో విపక్ష పాత్ర పోషించడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి.

విపక్షం వైపు కొంత ఖాళీగానే ఉంది. దానిని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ తీసుకోవాల్సిన చాన్స్ తీసుకోవడం లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు షర్మిల మీద ఏ ఆశలతో బాధ్యతలు అప్పగించారో దానిని పూర్తి చేసిన నాడే కాంగ్రెస్ ఏపీలో వికసిస్తుంది. అదే సమయంలో ఆమె మీద వైసీపీ చేసే విమర్శలు కూడా అర్ధ రహితంగా మారుతాయి. అంతే తప్ప మాటకు మాట అప్పచెబితే మాత్రం ఏపీలో కాంగ్రెస్ ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగానే అలా ఉంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News