మోడీ కంటే రాహుల్ బెటర్.. సంచలనం రేపిన షాహిద్ అఫ్రీది వ్యాఖ్యలు
అఫ్రీది, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. "కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అలా కాదు. ఆయనది పాజిటివ్ మైండ్ సెట్.;
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది భారత రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన షేక్ హ్యాండ్ వివాదం నేపథ్యంలో అఫ్రీది ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయగా, రాహుల్ గాంధీని మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు.
*మోడీ ప్రభుత్వంపై విమర్శలు
అఫ్రీది తన వ్యాఖ్యలలో, భారత ప్రభుత్వం 'డర్టీ పాలిటిక్స్' చేస్తుందని ఆరోపించారు. "హిందూ-ముస్లిం కార్డు ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారు, ఎప్పుడూ మత రాజకీయాలు చేస్తారు" అంటూ మోడీ ప్రభుత్వ విధానాలపై ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు దేశంలోని రాజకీయ వర్గాలలో తీవ్ర దుమారం రేపాయి.
*రాహుల్ గాంధీపై ప్రశంసలు
అఫ్రీది, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. "కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అలా కాదు. ఆయనది పాజిటివ్ మైండ్ సెట్. నిరంతరం ప్రజలతో టచ్ లో ఉంటారు. ఎప్పుడూ వాస్తవాలే మాట్లాడతారు. న్యాయం కోసం పోరాడతారు" అని ఆయన కొనియాడారు. అంతేకాకుండా, రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలను ప్రత్యేకంగా గుర్తుచేస్తూ, "నిజాయితీగా, ప్రజల సమస్యలపై చర్చించే రాజకీయ నాయకుడు ఆయన. అదే ఆయనకు ప్రత్యేకత" అని అఫ్రీది వ్యాఖ్యానించారు.
వివాదానికి దారితీసిన అంశాలు
అఫ్రీది వ్యాఖ్యలు భారత్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఒక క్రీడాకారుడు ఒక దేశ అంతర్గత రాజకీయాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అరుదుగా చూస్తుంటాం. ఈ వ్యాఖ్యలు భారత్‌లో కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. రాహుల్ గాంధీకి అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం వారి నుంచి మద్దతు పొందగా, మోడీ ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు మరో వర్గం నుంచి విమర్శలకు గురయ్యాయి. ఈ పరిణామం రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంది.
పాకిస్తాన్ ఓడిపోయిందనే ఈ అక్కసు
పాకిస్తాన్ టీమిండియా చిత్తుగా ఓడగొట్టడం.. కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇతరులు అవమానంగా భావిస్తున్నారు. భారత్ పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ.. పహల్గాంలో అమాయకులను చంపిన ఘటనలు మాత్రం ఇదే అఫ్రిదీకి అస్సలు గుర్తుండవు. కేవలం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో అవమానంగా భావిస్తాడు. ఇలాంటి ఉగ్రవాద దేశంలో ఉండే ఇలాంటి మనస్తత్వం గల క్రికెటర్ల మాటలకు అసలు విలువ లేదు.