సీతక్క స్పెషల్ ఇదే.. చంద్రబాబు, లోకేశ్ నుంచి బర్త్ డే విషెస్!
ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో నేతలు తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పటికీ ఎవరికీ దక్కని గౌరవం, గుర్తింపు సీతక్కకు ఇప్పటికీ ఉందని తాజా ఘటన నిరూపించిందని చెబుతున్నారు.
రాజకీయాల్లో కొందరి ట్రాక్ రికార్డు చాలా స్పెషల్ గా ఉంటుంది. అటువంటి వారిలో తెలంగాణ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఒకరు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి దాదాపు పదేళ్లు కావస్తున్నా ఆ పార్టీ అధిష్టానంతో సత్సంబంధాలు ఉండటమే సీతక్క ప్రత్యేకత. విప్లవ రాజకీయాల నుంచి బయటకొచ్చి ప్రజాస్వామ్య భావాలతో ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించిన సీతక్క తెలుగుదేశం పార్టీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క అనూహ్య రాజకీయ పరిణామాలతో 2017లో టీడీపీకి దూరమయ్యారు. కానీ, ఇప్పటికీ టీడీపీ అధిష్టానంతో ఆమెకు దగ్గర సంబంధాలు ఉండటం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. గురువారం సీతక్క పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అగ్రనేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో నేతలు తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పటికీ ఎవరికీ దక్కని గౌరవం, గుర్తింపు సీతక్కకు ఇప్పటికీ ఉందని తాజా ఘటన నిరూపించిందని చెబుతున్నారు. టీడీపీలో పనిచేసింది కొద్దికాలమే అయినప్పటికీ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా అధినేత చంద్రబాబుతో ఆత్మీయ బంధం కొనసాగించడమే సీతక్క గౌరవం ఇప్పటికీ చెక్కుచెదరేలేదని అంటున్నారు. టీడీపీ విధానాలకు పూర్తి విరుద్ధమైన పార్టీలో ఉన్నప్పటికీ సీతక్కను వ్యక్తిగతంగా టీడీపీ అభిమానించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. సీతక్క కూడా అదే విలువలు కొనసాగిస్తూ టీడీపీ అగ్రనేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతిఏటా రక్షాబంధన్ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సీతక్క రాఖీ కడుతుంటారు. మిగిలిన టీడీపీ మహిళా నేతలు మాదిరిగానే సీతక్క సైతం రాఖీ పండుగ రోజు చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లడం రివాజుగా మారింది. ఆ విధంగా చంద్రబాబు ఆదరాభిమానాలను పొందిన సీతక్క టీడీపీకి ఎప్పుడూ స్పెషల్ గా మారారని అంటున్నారు. అందుకే ఆమె పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి లోకేశ్ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ మరచిపోకుండా ఉదయాన్నే సీతక్కకు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.
రాజకీయాల్లో నేతల పుట్టిన రోజు సందర్భంగా ఇలా శుభాకాంక్షలు చెప్పడం అత్యంత సాధారణ విషయమే అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలో ఉన్న నాయకులకు అగ్రనేతలు అభినందనలు చెప్పడమే నేటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా చెబుతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయినప్పటికీ ఆ పార్టీ పట్ల ఎప్పుడూ వ్యతిరేక భావం వ్యక్తం చేయకపోవడమే సీతక్కకు ఆ పార్టీలో ఇప్పటికీ గౌరవం దక్కేలా చేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరిస్తున్న సీతక్క టీడీపీ కేడర్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.