పాక్ కు బిగ్ బ్యాడ్ న్యూస్... చీనాబ్ నదిపై భారత్ చెక్ ఇలా!

పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ఏప్రిల్‌ లో సిందూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-07-31 17:50 GMT

పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ఏప్రిల్‌ లో సిందూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్ ఇప్పుడు తన జలవిద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి.. ఒప్పందం ప్రకారం గతంలో పాకిస్తాన్‌ కు కేటాయించిన పశ్చిమ నదిని ఉపయోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది. అది తన హక్కు అని నొక్కి చెబుతూ, నీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది.

అవును... సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత జమ్మూ కశ్మీర్‌ లో భారత ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా... చీనాబ్‌ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌ కోట్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో.. ఇది పాక్ కు బిగ్ షాక్ అని అంటున్నారు.

ఈ క్రమంలో సావల్ కోట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్.హెచ్.పీ.సీ.) ఇటీవల అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. 1856 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.22 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా ఉండగా... రెండు దశల్లో దీన్ని నిర్మించనున్నట్లు చెబుతున్నారు.

వాస్తవానికి చీనాబ్‌ నదిపై సావల్‌ కోట్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన 1980ల నుంచే ఉంది. అయితే... అప్పట్లో దీనిపై పాకిస్థాన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో సుమారు 40 ఏళ్లుగా భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే.. ఇటీవల లెక్కలు మారాయి, పరిణామాలు మారాయి.

ఈ క్రమంలో ఇటీవల సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. తాజాగా పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది.

కాగా... సింధూ జలాల ఒప్పందం ప్రకారం, పశ్చిమదిశగా పాకిస్థాన్‌ వైపు ప్రవహించే సింధూతోపాటు చీనాబ్‌, జీలం వంటి ప్రధాన ఉప నదులపై భారత్‌ కు పరిమిత అధికారాలు ఉండేవి. దీంతో భారీ స్థాయిలో నీరు నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇదే సమయంలో... ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలన్నా.. పాక్‌ కు ముందస్తు నోటీసు ఇవ్వాలి.

అయితే... పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని పేర్కొంటూ ఏప్రిల్‌ లో భారతదేశం సిందూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో.. ఇప్పుడు డేటా షేరింగ్, ప్రాజెక్టుల ముందస్తు నోటిఫికేషన్ వంటి ఒప్పంద బాధ్యతల నుండి భారత్ కు విముక్తి లభించింది. అప్పటి నుండి చీనాబ్‌ లోని బాగ్లిహార్, సలాల్ ఆనకట్టల నుండి నీటి ప్రవాహాలను పరిమితం చేసింది.

Tags:    

Similar News