పాక్ సౌదీలతో ట్రంప్ కార్డు...భారత్ కి డేంజర్ బెల్స్ ?
వర్తమాన యుగంలో అందరూ అత్యధునిక ఆయుధాలతో సిద్ధంగా ఉంటున్నారు. పూర్వం మాదిరిగా సంప్రదాయ యుద్ధాలు అన్నవి లేవు.;
వర్తమాన యుగంలో అందరూ అత్యధునిక ఆయుధాలతో సిద్ధంగా ఉంటున్నారు. పూర్వం మాదిరిగా సంప్రదాయ యుద్ధాలు అన్నవి లేవు. టెక్నాలజీయే ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ నేపధ్యంలో ఏ దేశమైనా శతౄవ్గా మారితే కనుక అది ఇబ్బందికరమే అవుతుంది. ఇక శతౄవు శతృవు తమకు మిత్రుడు అన్న సూత్రంతో మరే దేశమైనా పావులు కదిపితే అది ముప్పేట చిక్కులు తెచ్చే అవకాశాలే ఉంటున్నాయి. ఇపుడు భారత్ విషయంలో మూడు దేశాలు కలసి కట్టిన చేతులు ఏ దిశను నిర్ణయిస్తాయన్నది చర్చనీయాంశం అవుతోంది.
సౌదీ పాక్ తో పెద్దన్న :
ఒక వైపు పాకిస్తాన్ భారత్ కి ఎప్పటి నుంచో దాయాది దేశం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ భారత్ దెబ్బను రుచి చూసిన తరువాత గుణపాఠం నేర్చుకోకపోగా మరింతగా రెచ్చిపోతోంది. ఈ నేపధ్యంలో సౌదీ అరేబియాతో కొత్త స్నేహం మొదలెట్టింది. ఈ సెప్టెంబర్ లో సౌదీ అరేబియా పాక్ కీలక ఒప్పందాలను చేసుకున్నాయి. ఇపుడు చూస్తే అమెరికా పెద్దన్న కూడా ఈ ఇద్దరితో సై అంటున్నారు. తమకు నాటో దేశాల తరువాత అతి ముఖ్యమైన మిత్ర దేశం సౌదీయే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడంతో భారత్ ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించాల్సిన పని పడింది అని అంటున్నారు.
అమెరికా భారత్ ల మధ్య :
ఇక చూస్తే కనుక అమెరికా భారత్ ల మధ్యన సంబంధాలు ఇటీవల కాలంలో అంత బాగా లేవు. వరసబెట్టి వాణిజ్య సుంకాలను అధికంగా పెంచడం ద్వారా అమెరికా పెద్దన్న భారత్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. మరో వైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కూడా అమెరికాకు కన్నెర్రగా మారింది. ఇక భారత్ అయితే అందరితో స్నేహం చేస్తూనే తన అస్తిత్వం కాపాడుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్వేత సౌధం భారత్ మీద ఎందుకో తెలియని కోపంతో గ్యాప్ ని పెంచుకుంటోంది అని అంటున్నారు.
సౌదీ పాక్ ల చెలిమి :
ఇక సౌదీ అరేబియా పాకిస్థాల మధ్య కొత్తగా బలంగా పెరుగుతున్న అనుబంధం కూడా భారత్ ని ఆలోచించుకునే లాగానే చేస్తోంది అని అంటున్నారు. అదే సమయంలో సౌదీతో కూడా భారత్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో సౌదీ పర్యటన చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశంతో అనేక రంగాలలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. టెక్నాలజీ ఇంధనం తదితర రంగాలలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కూడా సౌదీ అంగీకరించింది. ఇలాంటి సౌదీ సెప్టెంబర్ నాటికి పాక్ వైపు కొంత మొగ్గినట్లుగా సీన్ అయితే కనిపిస్తోంది. ఇక సౌదీ అరేబియాను పశ్చిమ దేశాలు మరీ ముఖ్యంగా అమెరికా చాలా కాలం పాటు దూరంగా ఉంచింది. గత అధ్యక్షుడు జో బైడెన్ అయితే సౌదీకి పూర్తిగా ఎడం పాటించారు. అయితే ట్రంప్ ఉన్నట్టుండి సౌదీ మిత్ర దేశం అంటూ వేసిన ట్రంప్ కార్డు తో ఇపుడు దక్షిణాసియా దేశాల మధ్య కొత్త రకం సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
వైట్ హౌస్ లో సౌదీ యువ రాజు :
అంతే కాదు ట్రంప్ తన వైట్ హౌస్ కి సౌదీ యువరాజు మహమ్మద్ బీన్ సల్మాన్ ని ఆహ్వానించి మరీ ద్వైపాక్షిక చర్చలు జరపడం కూడా విశేష పరిణామంగా చెప్పుకుంటున్నారు. ఇంకో వైపు చూస్తే సౌదీ యువ రాజు ట్రంప్ ల మధ్య బలపడుతున్న ఈ బంధం సంగతి అంతా ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ భద్రత, వాణిజ్య రంగాలలో బంధం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించడమూ కీలకమైన పరిణామమే. అంతే కాదు ఎం 25 ఫైటర్ జెట్స్ ని విక్రయించేందుకు ట్రంప్ అంగీకరిస్తే అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ముందుకు వచ్చింది. సౌదీని అత్యంత మిత్ర దేశంగా సౌదీని పరిగణించడం ద్వారా అమెరికా అనేక రంగాలలో ఆ దేశానికి దోహదపడుతుంది. అలా తనకు అత్యంత సన్నిహితమైన దేశాల జాబితాలో సౌదీని ట్రంప్ చేర్చగలిగారు.
పాక్ సౌదీలతో :
సౌదీ పాక్ ల మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం ఇప్పటికే ఉంది. ఒక దేశం మీద దాడి జరిగితే రెండవ దేశం మీద కూడా దాడి జరిగినట్లుగా భావిస్తూ రెండు దేశాలు ఒకేసారి ప్రత్యర్ధి మీద యుద్ధానికి దిగుతాయి అన్న మాట. పాకిస్థాన్ ఈ ఒప్పందం ఆసరాతో భారత్ ని టార్గెట్ చేసుకుంటారని అంటున్నారు. ఇక భారత్ కి సౌదీతో అవసరాలు చాలానే ఉన్నాయి. చమురు విషయంలో మూడవ అతి పెద్ద సరఫరాదారు. భారత్ సౌదీల మధ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటానికి సౌదీ మద్దతు ఇస్తోంది. అయితే సౌదీ అమెరికా దోస్తీతో మధ్య ప్రాచ్యంలో ఎన్నో కీలక మార్పులు వస్తాయని దౌత్య పరంగా భారత్ కూడా చాలా అంశాలలో పునస్సమీక్షించుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా సౌదీ ప్లస్ పాక్ ప్లస్ అమెరికా అంటే డేంజర్ సిగ్నల్స్ గానే చూడాలని అంటున్నారు.