సత్య నాదెళ్లకు పురస్కారం.. భారతీయులపై ఆంక్షలు.. ట్రంప్‌కు మేధస్సు కావాలి కానీ మనుషులు వద్దా?
మైక్రోసాఫ్ట్ సంస్థను సగర్వంగా ముందుకు నడిపిస్తున్న మన తెలుగు బిడ్డ సత్య నాదెళ్లకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా 'నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్' పురస్కారాన్ని అందించడం విశేషం.
అమెరికా రాజకీయాలు ఎప్పుడూ ఒక మిస్టరీనే.. ఒకవైపు "స్వదేశీయులకే ప్రాధాన్యం" అంటూ విదేశీ నిపుణులపై వీసా ఆంక్షలు విసరడం.. మరోవైపు అదే విదేశీ మూలాలున్న మేధావులను వేదికపైకి పిలిచి మెడలో మెడల్స్ వేసి శభాష్ అనడం ట్రంప్ మార్క్ పాలనకు పక్కా ఉదాహరణగా నిలుస్తోంది. ఒకే వేదికపై నుంచి రెండు వేర్వేరు సంకేతాలు పంపడంలో ట్రంప్ శైలి నిజంగా వేరే లెవల్..
మైక్రోసాఫ్ట్ సంస్థను సగర్వంగా ముందుకు నడిపిస్తున్న మన తెలుగు బిడ్డ సత్య నాదెళ్లకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా 'నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్' పురస్కారాన్ని అందించడం విశేషం. వాషింగ్టన్‌లో జరిగిన 'ఎ న్యూ గోల్డెన్ ఏజ్' సదస్సులో నాదెళ్ల నాయకత్వాన్ని సాంకేతిక రంగానికి ఆయన చేసిన సేవలను ట్రంప్ ఆకాశానికెత్తేశారు.
అయితే ఇక్కడే అసలు సినిమా ట్విస్ట్ ఉంది.. మరోపక్క అదే మైక్రోసాఫ్ట్ సంస్థపై ఫెడరల్ దర్యాప్తులు జరుగుతున్నాయనే సాకుతో కంపెనీకి చెందిన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (పీఈఆర్ఎం) కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిన్న పక్కన పెట్టారు. గ్రీన్‌కార్డ్ క్యూలో ఏళ్ల తరబడి వేచి చూస్తున్న భారతీయ టెక్కీలకు ఇది అస్సలు మింగుడుపడని పరిణామం. "మీ కంపెనీ వలస ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు ఇవ్వడానికి వీల్లేదు గానీ ఆ కంపెనీని నడిపిస్తున్న భారతీయుడికి మాత్రం మేం మెడల్ తొడుగుతాం" అన్నట్లుగా ఉంది వాషింగ్టన్ వైఖరి.
అమెరికా టెక్ రంగానికి భారతీయ నిపుణులు వెన్నుముక వంటివారు. కానీ ట్రంప్ సర్కార్ విధానాలు మాత్రం విరుద్ధమైన దిశలో పయనిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు వీసాలు, గ్రీన్‌కార్డుల విషయంలో కఠిన నిబంధనలు తెస్తూ స్థానిక ఓటు బ్యాంకు కోసం "అమెరికా ఫస్ట్" అని నినదిస్తున్నారు. మరోవైపు ప్రతిభావంతులైన నాయకులకు జాతీయ స్థాయిలో గౌరవం అందిస్తూ ఏఐ , క్లౌడ్ రంగాల్లోని కంపెనీల వృద్ధిని ప్రశంసిస్తున్నారు.
ఈ పరిణామం చూస్తుంటే అమెరికాకు భారతీయ మూలాలున్న మేధావుల ప్రతిభ, వారి వల్ల వచ్చే బిలియన్ డాలర్ల ఆదాయం, ఏఐ రేసులో అమెరికాను ముందుంచే నాయకత్వం ముమ్మాటికీ కావాలని స్పష్టమవుతోంది. కానీ అదే సమయంలో స్థానిక రాజకీయాల కోసం "వలసదారులను అడ్డుకుంటున్నాం" అని చూపించుకోవాల్సిన బలహీనత కూడా కనిపిస్తోంది.
2014లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన నాదెళ్ల.. అజ్యూర్ క్లౌడ్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యాలతో మైక్రోసాఫ్ట్‌ను ప్రపంచ టెక్ సింహాసనంపై కూర్చోబెట్టారు. ఆ ప్రతిభను గుర్తించకపోతే అమెరికాకే నష్టం. అయితే పీఈఆర్ఎం చర్యలు కానీ.. వీసా నిబంధనల కట్టుదిట్టం కానీ సత్య నాదెళ్ల వ్యక్తిగత విజయానికి అడ్డంకి కాకపోవచ్చు. కానీ రేపటి నాదెళ్లలుగా ఎదగాలని కలలుకనే వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై మాత్రం నీలినీడలు పరుస్తున్నాయి.
సత్య నాదెళ్లకు లభించిన అవార్డు భారతీయ ప్రతిభకు దక్కిన అంతర్జాతీయ గౌరవమే.. అందులో సందేహం లేదు.. అయితే ఈ ఒక్క అవార్డును చూసి అమెరికా వలస విధానాలన్నీ భారతీయులకు పూలబాట వేస్తున్నాయని పొంగిపోలేం. అలాగే ఒక కంపెనీ పీఈఆర్ఎం ప్రక్రియపై పడిన బ్రేకుల ఆధారంగా భారతీయులందరినీ అమెరికా తరిమేస్తోందని భయపడాల్సిన పనిలేదు. అమెరికా విధానాలలోని ఈ చమత్కారాన్ని అర్థం చేసుకుంటూనే స్వచ్ఛమైన ప్రతిభను నమ్ముకుని ముందుకు సాగడమే భారతీయ టెక్కీల ముందున్న ఏకైక మార్గం.