మస్క్ తానా అంటే రాహుల్.. కేటీఆర్ తందానా అనటమేనా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాను కోరుకున్నది దక్కించేందుకు ఆయన ఏ స్థాయి వరకు వెళతారన్న విషయాన్ని.. ఇప్పటికే పలు దేశాల్లో చూస్తున్నదే. అలాంటి మస్క్ ఒక దేశ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా పోస్ట్ చేశారంటే.. దాని అర్థం అదేమీ సామాన్య విషయం కాదు. అలాంటి వ్యాఖ్యలను సమర్థించే పని చేస్తున్నా.. స్పందించే సమయంలో ఆచితూచి అడుగులు వేయటం తప్పనిసరి. కానీ.. తాజాగా మాత్రం కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకడు కేటీఆర్ లు మాత్రం తప్పులో కాలేసినట్లుగా కనిపిస్తోంది. ఉత్సాహానికి బదులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారా? అన్న సందేహం కలిగేలా వీరి రియాక్షన్ ఉందని చెప్పాలి.
ముందుగా ఎలాన్ మస్క్ ఏమన్నారు? దాని తర్వాత రాహుల్.. కేటీఆర్ ల స్పందన ఏమిటి? దానిలో లాజిక్ ఏమైనా ఉందా? కేవలం తమ రాజకీయ ప్రత్యర్థిని రెండు మాటలు అనేందుకు అవకాశం దక్కిందన్న అల్పానందమే తప్పించి.. దేశ ప్రయోజనాలు.. భారత ప్రభుత్వ చర్యల మీద పూర్తిస్థాయి అవగాహనతో మాట్లడారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తన వ్యాపారంలో అత్యంత కీలకమైన స్టార్ లింక్ కు భారత్ లో లైసెన్స్ రావటం ఆలస్యమవుతుందని చెబుతూ.. దానికి భారత ప్రభుత్వంపై మస్క్ విమర్శలు.. ఆరోపణలు చేశారు. మొదటి పోస్ట్ లో ‘తమ స్టార్ లింక్ సేవల్ని కొందరు అధికారబలం ఉన్న పారిశ్రామికవేత్తలు (ఒలిగార్క్స్) అడ్డుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
ఈ పోస్ట్ చూసినంతనే సామాజిక అంశాల మీద కాస్తంత అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన టార్గెట్ చేసింది రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ అని. మస్క్ పోస్ట్ ను భారత ప్రభుత్వం ఖండించటమే కాదు.. ఎవరికీ తాము ఇప్పటివరకు స్టార్ లింక్ కోరుకున్న వ్యాపారానికి సంబంధించి అనుమతులు ఇవ్వలేదని చెప్పిన క్రమంలో.. మస్క్ మళ్లీ స్పందిస్తూ.. భారత్ కు అసలైన బాస్ అంబానీనా? అంటూ సంచలన ఆరోపణ చేశారు.
ఈ క్రమంలో మస్క్ పోస్ట్ పై స్పందించిన ఇద్దరు ముఖ్య రాజకీయ నేతల్లో ఒకరు కాంగ్రెస్ కీలక నేత కం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే.. మరొకరు బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరు కేటీఆర్. అయితే.. వీరిద్దరి స్పందన వేర్వేరుగా ఉన్నా.. మస్క్ పోస్టుకు స్పందించి బిస్కెట్ అయ్యారన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. తొలుత కేటీఆర్ విషయానికి వస్తే.. మస్క్ పోస్ట్ కు స్పందిస్తూ.. ఎలాన్.. వారి పేర్లు బయటపెట్టి వారిని నిలదీయండి. మన ప్రభుత్వంపై అంతలా పట్టు సాధించిన ఆ వ్యక్తులు ఎవరో ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.
నిజానికి మస్క్ టార్గెట్ చేసింది ఎవరినో అందరికి తెలిసినా.. కేటీఆర్ ఆ పేర్లను తన నోటితో ప్రస్తావించకుండా.. మస్క్ చేత చెప్పించాలన్న ప్రయత్నం చేశారు. అయితే.. మస్క్ పోస్ట్ పై స్పందించే క్రమంలోనిజంగానే ఆయన ఆరోపణల్లో వాస్తవం ఎంత? భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా మస్క్ పోస్ట్ ఎందుకు పెట్టారన్న దాని కంటే.. తక్షణ రాజకీయ ప్రయోజనమే తనకు ముఖ్యమన్నట్లుగా వ్యవహరించారని చెప్పాలి. మస్క్ పోస్ట్ కు స్పందించిన భారత ప్రభుత్వం ఎవరికి అనుమతులు ఇవ్వలేదని చెప్పిన క్రమంలో.. కేటీఆర్ స్పందన తేలిపోవటమే కాదు.. అరకొర సమాచారంతో అత్యున్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకుడు స్పందించటమా? అన్న సందేహం కలుగుతుంది.
కేటీఆర్ తీరు ఇలా ఉంటే.. రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకు వేసి.. విమర్శల్ని మూటగట్టుకున్నారు. సీఈసీ రాజీనామా పేరుతో ఢిల్లీ వేదికగా గడిచిన రెండు రోజులుగా నిర్వహించిన నిరసనలు.. ఆందోళనలతో రాహుల్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ.. మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడన్న భావన కలిగిస్తున్న సందర్భంలో మస్క్ పోస్ట్ కు మరింత జాగ్రత్తగా స్పందించి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ చేయకుండా ఒక సగటు రాజకీయనాయకుడి తరహాలో స్పందించిన తీరుతో.. ఆయన విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి.
మస్క్ పోస్టుకు స్పందించిన రాహుల్ గాంధీ వ్యంగ్యంగా.. ‘‘భారత్ కు స్వాగతం ఎలాన్. ఇక్కడ మీరు మరో వ్యక్తి గురించి కూడా తెలుసుకునే వరకు వేచి చూడండి’ అంటూ అదానీ ప్రస్తావనను పరోక్షంగా తీసుకొచ్చి సమాధానం ఇచ్చారు. దీనికి వెంటనే మస్క్ స్పందించి.. ‘థాంక్యూ రాహుల్. ఇది నిజంగానే తీవ్రంగా ఆందోళనకరమైన విషయం’ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో రాహుల్ మిస్ అయిన పాయింట్ ఏమంటే.. మస్క్ కోరుకుంటున్న వ్యాపార అనుమతికి భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు. మస్క్ మాదిరే అప్లికేషన్ పెట్టుకొని అనుమతుల కోసం నిరీక్షిస్తున్న జాబితాలో రిలయన్స్ అంబానీ మాత్రమే కాదు ఎయిర్ టెల్ సునీల్ మిట్టల్ కూడా ఉన్నారన్న విషయాన్ని మరచిపోకూడదు.
జాతీయ ప్రయోజనాలతో ముడిపడే అంశాల విషయంలో స్పందించే వేళలో.. రాహుల్ లాంటి నేత మరింత బాధ్యతగా స్పందించాలే తప్పించి.. మస్క్ తానా అంటే రాహుల్.. కేటీఆర్ మాదిరి తందాన అనటంలో అర్థం లేదు. ఒకవేళ స్పందించాలని భావిస్తే.. అత్యంత జాగ్రత్తగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టి భారత ప్రయోజనాల కోణంలో ఈ అంశాల్ని చూడాల్సిందే. అంతే తప్పించి.. తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కూడా అదే పనిగా స్పందించటం రాహుల్.. కేటీఆర్ లాంటోళ్లకు నష్టమే చేస్తుంది తప్పించి లాభం కాదన్నది మర్చిపోకూడదు.
ఒక విదేశీ కంపెనీ ఒత్తిడికి లొంగకుండా తన సొంత నిబంధనలకు కట్టుబడి ఉండటం భారతదేశ సౌర్వభౌమత్వానికి నిదర్శనం. ఇలాంటి విషయాల్లో స్పందించాలనుకునే రాహుల్.. కేటీఆర్ లాంటోళ్లు మరింత లోతుగా విషయాల్ని పరిశీలించిన తర్వాతే రియాక్ట్ కావాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే.. జాతీయస్థాయిలో వారు డ్యామేజ్ అవుతారన్న చిన్న విషయాన్ని ఎలా మిస్ అయ్యారన్నది ప్రశ్న. మస్క్ విమర్శకు ఇప్పటికే కేంద్ర టెలికాం శాఖ.. జియో.. ఎయిర్ టెల్ లాంటివారి నుంచి వచ్చిన స్పందన చూస్తే.. మస్క్ కేవలం తన వ్యాపార ప్రయోజనాల కోసమే భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అర్థమవుతుంది. ఈ సందర్భంలో రాహుల్.. కేటీఆర్ స్పందనలు వారి అవగాహన రాహిత్యాన్ని.. బాధ్యతారాహిత్యాన్ని చూపించేలా ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు.