మస్క్ పోస్టు కలకలం.. భారత్ కు అసలైన బాస్ అంబానీ!

తాను కోరుకున్నది జరిగేలా చేసేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దేనికైనా వెనుకాడడన్న మాటకు తగ్గట్లే.. తాజాగా ఆయన ఎక్స్ లో చేసిన పోస్ట్ కనిపిస్తోంది.

Update: 2026-10-09 03:46 GMT

తాను కోరుకున్నది జరిగేలా చేసేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దేనికైనా వెనుకాడడన్న మాటకు తగ్గట్లే.. తాజాగా ఆయన ఎక్స్ లో చేసిన పోస్ట్ కనిపిస్తోంది. తన స్టార్ లింక్ కంపెనీకి అనుమతి కోసం గడిచిన రెండు రోజులుగా ఎక్స్ లో పోస్టులు పెట్టటం ద్వారా భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నారు. తాజాగా భారత్ కి అసలైన బాస్ అంబానీయేనా? అంటూ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు కేంద్రంలోని మోడీ సర్కార్ అంబానీ.. అదానీలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని రాజకీయ పార్టీలు తరచూ ఆరోపించటం తెలిసిందే.

ఇప్పుడు ఇదే పాట మస్క్ నోటి నుంచి రావటం గమనార్హం. తమ గుత్తాధిపత్యానికి ముప్పు కలుగుతుందనే భయంతో కొన్ని వ్యాపార శక్తులు భారత్ లో స్టార్ లింక్ సర్వీసులను అడ్డుకుంటున్నారంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం ఖండించిన కొన్ని గంటల వ్యవధిలోనే అంబానీ పేరును తెర మీదకు తీసుకొచ్చిన తీరు చూస్తే.. మోడీ సర్కార్ కు మస్క్ రూపంలో కొత్త తలనొప్పి మొదలైనట్లుగా కనిపిస్తోంది.

స్టార్ లింక్ కు 165కు పైగా దేశాల్లో లైసెన్సులు ఉన్నాయని.. భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి చట్టాన్ని.. ప్రతి రూల్ ను తాము ఐదేళ్లుగా పాటిస్తూనే వస్తున్నామని.. అయినా సరే ఇప్పటివరకు లైసెన్స్ ఎందుకు ఇవ్వటం లేదు? అని ప్రశ్నిస్తున్న మస్క్.. ఆయన కోరుకున్న లైసెన్సు తరహా వ్యాపారానికి భారత్ లో మరే కంపెనీకి కూడా అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించటం లేదు. శాట్ కామ్ కంపెనీలు అన్నింటికి టెలికాం శాఖ ఇప్పటికే లైసెన్స్ లు.. ప్రొవిజనల్ స్పెక్ట్రం ఇచ్చినప్పటికి.. తదుపరి సెక్యూరిటీ క్లియరెన్స్ కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్ లో ఉంది. ఇది ఒక్క స్టార్ లింక్ కే కాదు.. ఎయిర్ టెల్..రిలయన్స్ జియో లకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.

ఈ వాదనకు బలం చేకూరేలా భారతి ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తాజాగా స్పందిస్తూ.. ‘‘తమ సొంత శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ వన్ వెబ్ కోసం మేం కూడా రెగ్యులేటరీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొనటం గమనార్హం. రిలయన్స్ జియోకు చెందిన శాట్ కామ్ కు సైతం ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చినా.. భద్రత, స్పెక్ట్రం అనుమతుల ప్రక్రియ ఇప్పటికి పెండింగ్ లోనే ఉంది. అంటే.. మస్క్ కు మాత్రమే కాదు.. ఆయన తాజా పోస్ట్ లో ‘భారత్ కు అసలైన బాస్ అంబానీనే’ అన్న వ్యాఖ్యల్నే తీసుకుంటే.. వారికి చెందిన జియో సంస్థకు సైతం అనుమతుల ప్రక్రియ పెండింగ్ లో ఉన్న విషయాన్ని దాచి పెట్టిన మస్క్.. మోడీ సర్కార్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశమని చెప్పాలి.

కొసమెరుపు ఏమంటే.. భారత్ కు స్టార్ లింక్ వస్తే.. ప్రస్తుత ధరలను భరించలేని వారికి.. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని చౌకగా అందించేందుకు వీలవుతుందన్న మాటనే తీసుకుంటే.. మస్క్ కు చెందిన స్టార్ లింక్ 165 దేశాల్లో సేవల్ని అందిస్తుందని చెప్పాడు కదా.. అందులో నిజమెంత? అన్నది చూస్తే.. షాకింగ్ అంశం కనిపిస్తుంది. స్టార్ లింక్ తన సేవల్ని అందించే దేశాల్లో అత్యంత చౌక టారిఫ్ ఉగాండాలోనే. ఆ టారిఫ్ లు మన దేశంలో ప్రస్తుతం జియో, ఎయిర్ టెల్ సంస్థల టారిఫ్ కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. అంటే.. మస్క్ మాష్టారు చెప్పిన చౌక టారిఫ్ మాట.. నేతి బీరకాయలో నేతి చందంగా ఉంటుందని చెప్పక తప్పదు.




Tags:    

Similar News