ప్రమోషన్ కావాలా? ఆస్తుల వివరాలు చెప్పండి.. విజయ్ సర్కార్ సంచలనం

రాజకీయాలకు కొత్త. ఆ మాటకు వస్తే.. ఎలాంటి పదవులను చేపట్టిన అనుభవం లేదు.

Update: 2026-10-09 03:47 GMT

రాజకీయాలకు కొత్త. ఆ మాటకు వస్తే.. ఎలాంటి పదవులను చేపట్టిన అనుభవం లేదు. ఇలాంటి సందర్భంలో పార్టీ పెట్టేసి.. ఎన్నికల బరిలోకి దిగేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఆషామాషీ వ్యవహారం కాదు. అతి కొద్ది మంది రాజకీయ అధినేతలకు మాత్రం ఇది సాధ్యమవుతుంది. సుదీర్ఘ కాలం తర్వాత ఆ మేజిక్ ను రిపీట్ చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్. పాలనలో ఎలాంటి అవగాహన లేదన్న రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు తాను తీసుకుంటున్న వరుస సంచలన నిర్ణయాలతో నోళ్లకు తాళం పడేలా చేస్తున్నారు. తాజాగా విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆ కోవలోకే వస్తుంది.

రాజకీయాలకు కొత్త కావొచ్చు. పాలన మీద ఇప్పటివరకు అవగాహన లేకపోవచ్చు. కానీ.. వ్యవస్థల్ని మార్చాలన్న కమిట్ మెంట్ నిండుగా ఉంటే.. ప్రభుత్వాధినేతగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చన్న దానికి నిదర్శనంగా సీఎం విజయ నిలుస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలు వెల్లడిస్తేనే వారికి ప్రమోషన్లు ఉంటాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేసి.. మరో సంచలనానికి తెర తీశారు.తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

దీని సారాంశం ఏమంటే..ప్రభుత్వ ఉద్యోగులు తమ స్థిర, చరాస్తుల వివరాలతో పాటు ఫిక్స్ డ్ డిపాజిట్లు.. రుణాలు.. చేతిలో ఉన్న నగదు వివరాలను ఈ నెల చివర (అక్టోబరు 31) లోపు వెల్లడించాలని పేరకొన్నారు. అంతేకాదు.. ఇతరుల పేర్ల మీద ప్రభుత్వ ఉద్యోగులు ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే.. ఆ వ్యక్తికి.. ప్రభుత్వ ఉద్యోగికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేయాలని కోరారు. ప్రభుత్వం చెప్పిన గడువు లోపు ఆస్తుల వివరాలు వెల్లడించిన ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు మాత్రమే పదోన్నతి జాబితాలో పొందుపరుస్తామని పేరకొన్నారు.

ప్రభుత్వ ఆదేశాల్ని పాటించకుండా.. ఆస్తుల వివరాలను వెల్లడించని ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించిన వారిగా గుర్తిస్తామన్న ప్రకటన.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయని చెప్పొచ్చు. ఈ తరహా నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు తీసుకోరు? అన్నది ప్రశ్న. ఇలా అధికారికంగాతమ ఆస్తుల వివరాల్ని వెల్లడించిన అధికారి.. తర్వాతి రోజుల్లో జరిగే విచారణలో అంతకు మించిన ఆస్తులు ఉంటే.. వారికి కొత్త తిప్పలు పక్కా. విజయ్ సర్కారు తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలా రియాక్టు అవుతారన్నది ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News