డీలిమిటేషన్ బిల్లు కోల్డ్ స్టోరేజ్ కేనా ?

దేశంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకూ కమలం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది.

Update: 2026-10-09 03:41 GMT

దేశంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకూ కమలం  పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. అందుకే ఏప్రిల్ నెల 16 17 తేదీలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి మరీ డీలిమిటేషన్ బిల్లుని ఆమోదించు కోఅవడానికి చూసింది. అయితే అక్కడే కధ అడ్డం తిరిగింది. ఇండియా కూటమి పార్టీలతో పాటు ఇతర విపక్షాలు అన్నీ ఐక్యంగా నిలబడడంతో ఎన్డీయే 298 ఓట్లకే పరిమితమై బిల్లు వీగిపోయింది. మొత్తం లోక్ సభ ఎంపీలలో సభకు హాజరైన వారి నుంచి మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు డీలిమిటేషన్ వంటి రాజ్యాంగ సవరణ బిల్లులకు అవసరం అవుతుంది. అయితే సరిపడా మద్దతు లేకపోవడంతో బీజేపీ మరో కొత్త వ్యూహానికి తెర తీసింది.

విపక్షాలను చీల్చి :

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న బీజేపీ అక్కడ బలంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అడ్డంగా చీల్చింది. అందులో నుంచి 20 మంది ఎంపీలను ప్రత్యేక వర్గంగా జట్టు కట్టించింది. అలాగే ఏక్ నాధ్ షిండే నాయకత్వంలోని ఎన్ సీపీలోకి ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని ఎన్సీపీకి చెందిన ఆరుగురు ఎంపీలను చీల్చి మరింతగా ఎన్ డీయే బలాన్ని పెంచుకుంది. ఇక ఇండియా కూటమికి దూరం అయిన డీఎంకేని కూడా పరోక్షంగా దువ్వే ప్రయత్నం చేసింది. ఇంకా వీలైతే మరిన్ని పార్టీలను కలుపుకుని డీలిమిటేషన్ బిల్లుకి సరిపడా 362 సభ్యుల మద్దతు దక్కించుకోవాలని బీజేపీ తన వంతు తీవ్రంగానే కసరత్తుని చేస్తూ వచ్చింది.

షాకుల మీద షాకులు :

ఇక వర్షాకాల సమావేశాలలోనే డీలిమిటేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకోవాలని బీజేపీ వేసిన రాజకీయ వ్యూహానికి అంతే తెలివిగా ఇండియా కూటమి చెక్ పెట్టేసింది. ఒక్క రోజు కూడా వర్షాకాల సమావేశాలు జరగకుండా కాంగ్రెస్ ఆటంకపరుస్తూ వచ్చింది. బయట జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు అట్టుడికి పార్లమెంట్ ని స్థంభింపచేశాయి. ఈ క్రమంలో రాజకీయ అలజడిలో వర్షాకాల సమావేశాలు మొత్తం కరిగిపోయాయి. అయినా సరే డీలిమిటేషన్ ఆశలు అయితే బీజేపీలో ఇంకా సజీవంగా ఉన్నాయి. దానికి ఉదాహరణగా పార్లమెంట్ ని ప్రోరోగ్ చేయకపోవడం. ఎపుడైనా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ కి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలని చూస్తున్న క్రమంలో ఇపుడు ఉరమని ఉరుములా మెరవని మెరుపులా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇష్యూ తెర మీదకు వచ్చింది. దీంతో దేశంలో విపక్షాలు అన్నీ మళ్ళీ ఆందోళన బాట పట్టాయి.

తటస్థ పార్టీలు సైతం :

అయితే విపక్షాల రాజకీయం ఎపుడూ ఇలాగే ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ వైసీపీ బీజేడీ లాంటి తటస్థ పార్టీలు కూడా తమ ఫేస్ ని టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. ఏప్రిల్ లో డీలిమిటేషన్ బిల్లుకు లోక్ సభలో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు మద్దతు ఇచ్చారు. అందువల్లనే 298 ఓట్లు పడ్డాయి. ఇపుడు వైసీపీ కూడా ఈసీ తీరు మీద మండిపడుతోంది. ఏపీలో తమకు 2024 ఎన్నికల్లో అన్యాయం జరిగింది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ డీలిమిటేషన్ బిల్లిని ఈసారి సభకు తెచ్చినా వైసీపీ వంటి పార్టీల మద్దతు ఉంటుందా అన్నది ఇపుడు చర్చగా ఉంది. అంతే కాదు ఇతర పార్టీలు కూడా పునరాలోచనలో పడుతున్నాయని అంటున్నారు. డీఎంకే అయితే డీలిమిటేషన్ బిల్లుకి వ్యతిరేకమే అంటోంది. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు లోక్ సభ ఎంపీ సీట్లను పెంచుకునే డీలిమిటేషన్ బిల్లు కోల్డ్ స్టోరేజ్ కేనా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News