శాటిలైట్ టోల్ పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
తాజాగా అలాంటి అంశమే జాతీయ స్థాయి మొదలు ప్రాంతీయ మీడియా వరకు ప్రముఖంగా పబ్లిష్ అయ్యింది.;
మీడియాను సోషల్ మీడియా ప్రభావితం చేయటం గడిచిన కొంతకాలంగా ఎక్కువైంది. అదెంత ఎక్కువైందంటే.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు సైతం సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్స్ ను పట్టుకొని కథలు అల్లేస్తున్న తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి అంశమే జాతీయ స్థాయి మొదలు ప్రాంతీయ మీడియా వరకు ప్రముఖంగా పబ్లిష్ అయ్యింది. శాటిలైట్ ఆధారిత టోల్ విధానానికి కేంద్రం ఓకే చెప్పిందని.. మే ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లుగా వార్తలు అచ్చేశాయి.
ఈ వార్తల్లో నిజం లేకపోవటంతో కేంద్రం రంగంలోకి దిగాల్సి వచ్చింది. శాటిలైట్ ఆధారిత టోల్ విధానానికి సంబంధించిన అంశాలపై స్పష్టత ఇచ్చింది. మే ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త టోల్ విధానాన్ని అమలు చేయాలన్న ఆలోచన లేదని.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. తాజాగా జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.
ఫీజు వసూలుకు టోల్ ఫ్లాజా వద్ద వాహనాల్ని ఆపే అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్ పీఆర్) విధానాన్ని తొలుత ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్దే అమరుస్తారని పేర్కొంది. ఇందులో ఏఎన్ పీఆర్ తో పాటు ఫాస్టాగ్ సేవల్ని కూడా కలిపి అందిస్తారని పేర్కొంది. అంటే.. ఏఎన్ పీఆర్ విధానంలో కెమెరాలు వాహన నంబర్ ప్లేట్ ను గుర్తిస్తే.. వాహనాలు ఆగకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వసూలు చేస్తారని చెప్పింది. అందుకు భిన్నంగా నిబంధనల్ని ఉల్లంఘిస్తే మాత్రం ఈ-నోటీసులు జారీ చేస్తారని స్పష్టం చేసింది.