సంతోష్‌కు సిట్ నోటీసులు.. !
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంధువు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు.;
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంధువు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని ఆయనను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం.. 3 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని కోరారు. వచ్చేప్పుడు.. ఫోన్, ల్యాప్‌టాప్ సహా ట్యాబ్‌ను వినియోగిస్తుంటే.. వాటిని కూడా తీసుకురావాలని సూచించారు. ఒక్కరే రావాలని కోరడం మరో విశేషం.
దీనిపై సంతోష్‌కుమార్ స్పందిస్తూ.. తనకు చట్టం పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల అంత్యంత గౌరవం ఉందని.. తప్పకుండా సిట్ అధికా రులు చెప్పిన సమయానికి వారి కార్యాలయానికి వెళ్తానని చెప్పారు. విచారణకు సహకరిస్తానని తెలిపారు. కాగా.. బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో ఎవరి ప్రమేయం ఉంది? ఎవరెవరు బాధితులుగా ఉన్నారన్న విషయంపై ఏడాదికిపైగా విచారణ జరుగుతోంది. ఇటీవలే.. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లను కూడా విచారించారు.
అదేవిధంగా నాటి ఐపీఎస్ అధికారులను కూడా ఈ కేసులో భాగంగా విచారించారు. ఇటీవల జరిగిన విచారణలో హరీష్‌రావు, కేటీఆర్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. ప్రస్తుతం సంతోష్‌ను విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంతోష్ కుమార్ పేరు ఇప్పుడే వెలుగు చూసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఆయన పేరు వెలుగు చూడకపోవడం గమనార్హం. అనూహ్యంగా ఆయనకు నోటీసులు ఇవ్వడం.. 24 గంటలసమయం కూడా ఇవ్వకపోవడం.. ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. సిట్ విచారణను లైట్ తీసుకోవాలని.. ఇదంతా కేవలం `డబ్బా ప్రచారమని` వ్యాఖ్యానించినట్టు వార్తలు రావడం గమనార్హం. కానీ.. దీనిని సీపీ సజ్జనార్ కొట్టి పారేశారు. ఇది చాలా ప్రతిష్టాత్మక కేసు అని ఆయన పేర్కొన్నారు. దీనిలో ప్రముఖులే బాధితులుగా ఉన్నారని..ఇది చట్టవిరుద్ధంగా జరిగిన పెద్ద వ్యవహారమని ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా సంతోష్‌కుమార్‌ను విచారణకు పిలవడం.. ఒంటరిగా రావాలని.. ఫోన్లు, ట్యాబులు తీసుకురావాలని కోరడం గమనార్హం.