సంక్రాంతి స్పెషల్: భీమవరంలో హోటల్ గదుల డిమాండ్ 3 రోజులకు రూ.లక్ష

సంక్రాంతి అన్నంతనే తెలుగోళ్లకు గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. అందునా గోదావరి జిల్లాల్లో పండుగ సందడి ఒక రేంజ్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే.;

Update: 2026-01-10 04:17 GMT

సంక్రాంతి అన్నంతనే తెలుగోళ్లకు గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. అందునా గోదావరి జిల్లాల్లో పండుగ సందడి ఒక రేంజ్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా భారీ ఎత్తున జరిగే కోడి పందేలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీటిని ప్రత్యక్షంగా తిలకించేందుకు.. పందేల్లో పాల్గొనేందుకు ఏపీ వ్యాప్తంగానే కాదు తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలిరావటం కనిపిస్తుంది.

ఈసారి మరింత హైటెక్ తో నిర్వహిస్తున్న కోడిపందేల్లో పాల్గొనేందుకు భారీగా ప్లానింగ్ జరుగుతోంది. దీనికి తగ్గట్లే ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఐదు రోజుల పాటు లాడ్జీలు.. హోటల్ గదుల్ని ముందుగానే బుక్ చేసుకోవటంతో.. ఇప్పుడు అక్కడ గదుల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. భీమవరంలోని హోటళ్లలో బస కోసం రూ.లక్ష ఖర్చు పెట్టాల్సి రావటం హాట్ టాపిక్ గా మారింది. మూడు రోజుల బసకు ఏకంగా రూ.లక్ష మాట హోటల్ వారు చెప్పటంతో.. ఎంత సంక్రాంతి అయితే మాత్రం ఇంతలా షాకిస్తారా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

భీమవరం.. ఏలూరు.. తాడేపల్లిగూడెం. తణుకు.. పాలకొల్లు.. నరసాపురం.. ఆకివీడులో దాదాపు 150 హోటళ్లు ఉన్నప్పటికీ.. సంక్రాంతి సంబరాలకు తరలివచ్చే జనసంద్రం ముందు ఇవేమీ సరిపోని పరిస్థితి. దీంతో.. భారీగా పెరిగిన డిమాండ్ కు తగ్గట్లే.. హోటల్ ధరల్ని భారీగా పెంచేశారు నిర్వాహకులు. చివరకు ప్రైవేటు ఇళ్లను సైతం రోజుల లెక్కన అద్దెకు తీసుకుంటున్నారు.

హోటల్ గదులు దొరకని నేపథ్యంలో కల్యాణ మండపాలు సైతం బుక్ చేస్తున్నారు. భీమవరంలోని రెండు ప్రముఖ హోటళ్లలోకి ఒక గదికి మూడు రోజులకు రూ.లక్ష చొప్పున 60 రూంలను బుక్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి పండుగ ఏమో కానీ.. హోటల్ గదులకు పెరిగిన డిమాండ్ తో ధరల్ని అమాంతం పెంచేస్తున్నా.. గది దొరికితే అదే పదివేలుగా భావిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News