ముంబైలో అసెంబ్లీ రౌడీ... అప్పుడు నోటికి, ఇప్పుడు చేతులకు పని..!

అవును... ముంబైలోని గెస్ట్ హౌస్ లో కార్మికుడిపై శివసేన (ఏక్ నాథ్ షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ శారీరకంగా దాడి చేసినట్లు చూపించే వీడియో కొత్త వివాదానికి దారితీసింది.;

Update: 2025-07-09 07:15 GMT

రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడు, ప్రజలతో ఎన్నుకోబడిన నేతలు ప్రజలకు ఆదర్శంగా ఉండే రోజులు పోయి.. ఎలా ఉండకూడదో చెప్పుకునే ఉదాహరణగా మారిపోతున్నారనే అనే చర్చ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోందని చెప్పుకున్నా అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్య దేవాలయాలైన అసెంబ్లీలోనే నేతలు ఫోన్లలో ‘ఏవేవో’ చూసేవారనే చర్చ ఒకప్పుడు వైరల్ గా మారింది.

అసెంబ్లీ బూతులు మాట్లాడటాలు, స్పీకర్ పైకి కాగితాలు విసరడాలు, చేతులతో అసభ్యకర చేష్టలు ఎన్నో కనిపిస్తున్నాయి! ఈ సమయంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా గెస్ట్ హౌస్ లో బస చేసిన ఎమ్మెల్యే... అక్కడ తనకు వడ్డించిన ఆహారంలో నాణ్యత లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనై.. అక్కడున్న వ్యక్తిపై పిడిగుద్దులు గుద్దిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ముంబైలోని గెస్ట్ హౌస్ లో కార్మికుడిపై శివసేన (ఏక్ నాథ్ షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ శారీరకంగా దాడి చేసినట్లు చూపించే వీడియో కొత్త వివాదానికి దారితీసింది. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో టవల్, బనియన్ తో ఉన్న ఎమ్మెల్యే.. క్యాంటీన్ కార్మికుడిపై పిడిగుద్దులు కురిపించినట్లు కనిపిస్తుంది.

దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. సంజయ్ గైక్వాడ్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి! ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఎవరైనా ప్రజాస్వామ్య భాషను అర్థం చేసుకోలేకపోతే ఈ భాషలోనే సమాధానం చెబుతానని.. అతను మరాఠీ మాట్లాడతాడా లేదా హిందీ మాట్లాడతాడా అని చూసి తాను అతనిని కొట్టలేదని చెప్పుకొచ్చారు!

ఇదే సమయంలో... రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారని.. కార్మికులు, అధికారులు, అందరూ ఇక్కడ ఆహారం తింటారని.. ఇది ప్రభుత్వ క్యాంటీన్ కాబట్టి ఇక్కడ ఆహార నాణ్యత బాగుండాలని అన్నారు. సదరు క్యాంటిన్ కార్మికుడి విషయంలో తను చేసిన దానికి నాకు ఎలాంటి చింత లేదని సంజయ్ వార్తా సంస్థ పీటీఐతో స్పందించారు!

కాగా... సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వార్తాల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో... రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి రూ. 11 లక్షలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది జనవరిలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ... "ఇక్కడి ఓటర్లను 2-5 వేల రూపాయలు, మద్యం, మాంసానికి అమ్మేశారు.. వేశ్య కూడా దానికంటే బెటర్ గా ఉంటుంది" అని అన్నారు!

ఆ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వినిపించాయి. ఇది ఒక ప్రజాసేవకుడికి ఉండాల్సిన లక్షణం కాదనే కామెంట్లు వినిపించాయి. ఏది ఏమైనా... ఇలా వరుస వివాదాలతో సంజయ్ గైక్వాడ్ తనదైన రాజకీయాన్ని, ప్రజా‘సేవ’ని కొనసాగిస్తున్నారు!

Tags:    

Similar News