'డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీ' : ఇంటర్నెట్‌లో యంత్రాల పట్టు పెరుగుతోందా?

ఇంటర్నెట్ ఇప్పుడు మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా మారుతోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపిన వేదికగా ఉన్న ఇంటర్నెట్, ఇప్పుడు మనుషుల నియంత్రణ నుంచి జారిపోతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.;

Update: 2025-09-06 22:30 GMT

ఇంటర్నెట్ ఇప్పుడు మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా మారుతోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపిన వేదికగా ఉన్న ఇంటర్నెట్, ఇప్పుడు మనుషుల నియంత్రణ నుంచి జారిపోతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం 'డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీ' అని పిలిచే ఒక వివాదాస్పద సిద్ధాంతం. ఈ థియరీ ప్రకారం మనం ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూస్తున్న కంటెంట్, ఇంటరాక్షన్లలో ఎక్కువ భాగం నిజమైన మనుషులచే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట్స్‌, ఆటోమేటెడ్‌ స్క్రిప్ట్స్, లార్జ్‌ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) ఆధారిత అకౌంట్ల ద్వారా జరుగుతోంది. ఇది ఇంటర్నెట్ ప్రామాణికతను, విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది.

థియరీకి ఊతమిచ్చిన సామ్‌ ఆల్ట్‌మన్ వ్యాఖ్యలు

డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీ 2021లో ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇది ఒక ఊహాజనిత సిద్ధాంతంగానే పరిగణించబడింది. అయితే, ఈ మధ్య ఓపెన్ ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్ చేసిన వ్యాఖ్యలతో ఈ సిద్ధాంతం హాట్‌టాపిక్‌గా మారింది. చాట్‌జీపీటీని సృష్టించిన ఆల్ట్‌మన్‌, ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో “ఇంతకాలం నేను డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీని నమ్మలేదు, కానీ ఇప్పుడు ఎక్స్‌లో చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది” అని పోస్ట్ చేశారు. ఈ ఒక్క వాక్యం సోషల్ మీడియాలో కలకలం రేపింది. చాలామంది వినియోగదారులు ఆయన్ని "డెడ్‌ ఇంటర్నెట్‌కు పునాది వేసింది మీరే కదా?" అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇది ఇంటర్నెట్‌పై AI ప్రభావం ఎంతగా పెరిగిందో, ఆ విషయంలో ప్రజల్లో ఎంత అప్రమత్తత ఉందో తెలియజేస్తోంది.

- యంత్రాల మాయాజాలం: ప్రమాదాలు

డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీ కేవలం ఒక ఊహ కాదు, దానికి కొన్ని ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి.. మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఇంటరాక్ట్ అవుతున్నామో అది నిజమైన మనిషా లేక బాటా అని తెలుసుకోవడం కష్టమవుతోంది. సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించే కంటెంట్‌లో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం సవాలుగా మారింది. బాట్స్ తప్పుడు సమాచారాన్ని, ప్రచారాన్ని వేగంగా వ్యాప్తి చేయగలవు. నిరంతరంగా కృత్రిమ కంటెంట్ చూడటం, బాట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వినియోగదారులు ఒంటరిగా, నిస్సహాయంగా భావించే అవకాశం ఉంది. ఇంటర్నెట్‌లో నిజమైన మనుషులు చేసే ఇంటరాక్షన్స్ తగ్గిపోతే, దాని విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుంది.

- పరిష్కారంగా వరల్డ్‌కాయిన్ ప్రాజెక్ట్

ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించే ప్రయత్నంలో సామ్‌ ఆల్ట్‌మన్‌ 2023లో వరల్డ్‌కాయిన్ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఆన్‌లైన్‌లో ఒక వ్యక్తి నిజమైన మనిషి అని నిరూపించడం. దీనికోసం ఐరిస్‌ స్కాన్‌ ద్వారా ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీని ఇస్తారు. ఈ “ప్రూఫ్ ఆఫ్ పర్సన్‌హుడ్” ద్వారా ఆన్‌లైన్ ఐడెంటిటీని నిర్ధారిస్తారు. ఇది బాట్స్ , నకిలీ అకౌంట్ల సమస్యకు ఒక పరిష్కారంగా కనిపిస్తున్నప్పటికీ, దీనిపై గోప్యత, నియంత్రణ సవాళ్లు, అలాగే వ్యక్తిగత డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్నెట్‌లో యంత్రాల పట్టు పెరుగుతోందన్నది ఒక వాస్తవం. ఇంటర్నెట్ అనే ఈ అద్భుత సృష్టి మనిషి చేతుల్లోనే ఉండాలంటే, మనుషులుగా మనం మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీ నిజమో కాదో కాలమే నిర్ణయిస్తుంది, కానీ ఒక విషయం మాత్రం ఖాయం.. మనం సృష్టించిన టెక్నాలజీ మనల్ని నియంత్రించే స్థాయికి చేరకుండా చూసుకోవాలి. లేకపోతే ఇంటర్నెట్ అనేది కేవలం ఒక యంత్రాల లోకంలా మారిపోవచ్చు.

Tags:    

Similar News