అమరావతిపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. రాజధానిపై డిబేట్ కంటిన్యూ
రాజధాని అమరావతి నిర్మాణాలపై రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ జరుగుతోంది.;
రాజధాని అమరావతి నిర్మాణాలపై రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ జరుగుతోంది. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ కూటమి, ప్రభుత్వ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంపై వైసీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు, పార్టీ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని సజ్జల స్పష్టం చేశారు. అదే సమయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇల్లు ఉన్న ప్రాంతం, అమరావతి ఒక్కటైనా? అంటూ ప్రశ్నించారు. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.
రాజధాని అమరావతిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నదీ గర్భంలో నిర్మాణాలపై మాజీ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడం, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరడతో మరోసారి రాజధాని అమరావతి చుట్టూనే రాజకీయాలు కేంద్రీకృతమైనట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడారు. ఇందులో రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతింటాయని తెలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కోసం రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపేశారని ఆరోపించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడానికి బాబు క్లోజ్ డోర్ మీటింగ్ లో ఒప్పుకున్నారని సజ్జల ఆరోపించారు. లోపాయికారీ ఒప్పందం వల్లనో, తెలంగాణ సీఎంతో సంబంధాల వల్లనో రాయలసీమ లిఫ్ట్ ఆపేశారంటూ పేర్కొన్నారు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు, ఆయన మీడియా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజధాని అమరావతిలో తొలివిడతలో తీసుకున్న 50 వేల ఎకరాల్లో ఇప్పటికీ అభివృద్ధి లేదని ఆరోపించారు. మొదటి దశ అభివృద్ధి లేకుండానే రెండో దశ భూసేకరణ ఏంటీ? అంటూ సజ్జల ప్రశ్నించారు.
ప్రభుత్వం వల్ల అమరావతి రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అమరావతి రైతులను చంద్రబాబు భ్రమల్లో పెడుతున్నారు. అమరావతి పేరుతో రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. మొబలైజేషన్ అడ్వాన్స్ లతో బాబు అండ్ కో దోచుకుంటున్నారు. చంద్రబాబు అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అమరావతిలో ఇంటర్నల్ స్కామ్ లో చాలా ఉన్నాయి. నాకు ఏం అక్కర్లేదు అమరావతికి నిధులు ఇస్తే చాలని బాబు అంటున్నారు. అమరావతిలో నీళ్లు ఎత్తిపోయడానికే వేల కోట్లు పెడుతున్నారు. తన తందానా కంపెనీలకే బాబు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. కాంట్రాక్ట్ లు కట్టబెట్టిన కంపెనీల నుంచి బాబు 4 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు’’ అంటూ సజ్జల సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతిలో అన్యాయం, అవినీతి జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించకూడదు? పాలనా వికేంద్రీకరణలోనూ అమరావతిని వైసీపీ ప్రభుత్వం తక్కువ చేయలేదు. అమరావతిని మేం తక్కువ చేసినట్లు బాబు అండ్ కో ప్రచారం చేశారు. విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి అని చెప్పామంటూ తమ పార్టీ వైఖరిపై సజ్జల వివరణ ఇచ్చారు. అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని చెప్పారు. ఇదే సమయంలో విజయవాడ-గుంటూరు మధ్యలో ఫోకస్ పెడితే బాగుంటుందని చెప్పామన్నారు. రూ.లక్ష కోట్ల అప్పుకు ఏడాదికి రూ.8 వేల కోట్లు వడ్డీ కట్టాలని, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పెద్దది చేసి, కళ్లు పెద్దవి చేసి అరిస్తే బెదిరిస్తే ఎలా? – చంద్రబాబు బెదిరింపులు, అరుపులు కాకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.