సచిన్ వినయం.. వెంకయ్య చమక్కు.. ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో అపురూప దృశ్యాలు!

ఆంధ్రా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు కేవలం ఒక విద్యాసంస్థ వేడుకలుగా మాత్రమే కాకుండా.. భారతీయ సంస్కృతి, భాషాభిమానం, వ్యక్తిత్వ విలువల కలబోతగా నిలిచాయి.;

Update: 2026-04-28 05:57 GMT

ఆంధ్రా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు కేవలం ఒక విద్యాసంస్థ వేడుకలుగా మాత్రమే కాకుండా.. భారతీయ సంస్కృతి, భాషాభిమానం, వ్యక్తిత్వ విలువల కలబోతగా నిలిచాయి. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ చారిత్రక ఘట్టం.. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చమక్కులు.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రదర్శించిన సంస్కారంతో యావత్ భారతాన్ని ఆకర్షించింది.

సచిన్ టెండూల్కర్ సంస్కారం.. పాదరక్షలు వీడి భక్తితో..

ఈ వేడుకలో ఒక దృశ్యం సభికులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేయడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో సచిన్ చూపిన వినయం అందరినీ ఆశ్చర్యపరిచింది. విగ్రహాన్ని స్వీకరించే ముందు.. సచిన్ ఏమాత్రం తటపటాయించకుండా తన పాదరక్షలను (షూ) విడిచిపెట్టారు. దైవ ప్రతిమను అందుకునేటప్పుడు ప్రదర్శించాల్సిన కనీస ధర్మాన్ని, భక్తిని ఆయన చాటిచెప్పారు. కోట్లాది మంది ఆరాధించే ఒక అంతర్జాతీయ స్టార్.. అంతటి వినయాన్ని ప్రదర్శించడం చూసి సభికులు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశాన్ని మారుమోగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో "సచిన్ కేవలం గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, గొప్ప సంస్కారవంతుడు కూడా" అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వెంకయ్య నాయుడు వాగ్ధాటి.. భాషా, సంస్కృతిపై చమక్కులు

ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వేదికపైకి రాగానే సభలో ఉత్సాహం ఉరకలెత్తింది. తనదైన అల్లరి చమక్కులు.. ప్రాసలతో కూడిన ప్రసంగంతో ఆయన యువతను ఆలోచింపజేశారు.

- పిజ్జా వద్దు.. సంప్రదాయ ఆహారం ముద్దు!

మారుతున్న ఆహారపు అలవాట్లపై ఆయన ఘాటుగా స్పందించారు. "పిజ్జాలు, బర్గర్లు మన సంస్కృతి కాదు.. అవి కేవలం రోగాల గడ్డలు" అని వ్యాఖ్యానించారు. యువత చిరుధాన్యాలు, పూర్వీకులు అందించిన పౌష్టిక ఆహారం వైపు మళ్లాలని.. లేకపోతే చిన్న వయసులోనే డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించారు.

- 'ఎంజీ రోడ్' అంటే గౌరవం ఎక్కడ?

పేర్లను కుదించి పలకడంపై ఆయన తనదైన శైలిలో చురకలు అంటించారు. "మహాత్మా గాంధీ పేరును ఎంజీ రోడ్డుగా, సర్దార్ పటేల్ పేరును ఎస్పీ రోడ్డుగా మార్చేస్తున్నారు. పేరును కుదిస్తే ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం కూడా తగ్గిపోతుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల, ప్రముఖుల పేర్లను పూర్తిస్థాయిలో ఉచ్చరించడం మన బాధ్యతని గుర్తు చేశారు.

- కంటి చూపు 'తెలుగు'.. కళ్లద్దాలు 'ఇంగ్లీష్'!

మాతృభాష ప్రాముఖ్యత గురించి వెంకయ్య నాయుడు చెప్పిన ఉపమానం అందరినీ ఆకట్టుకుంది. "మాతృభాష మన కంటి చూపు లాంటిది, ఇంగ్లీష్ అనేది కేవలం కళ్లద్దాల వంటిది. చూపు ఉంటేనే కళ్లద్దాలకు విలువ ఉంటుంది" అని చెప్పారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదని, కానీ సొంత భాషను నిర్లక్ష్యం చేయడం ఆత్మహత్యాసదృశ్యమని యువతకు దిశానిర్దేశం చేశారు.

యూనివర్సిటీలు ఆవిష్కరణల కేంద్రాలు కావాలి

కేవలం డిగ్రీల కోసమే చదువుకోకుండా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని వెంకయ్య నాయుడు విద్యార్థులను కోరారు. విశ్వవిద్యాలయాలు పేటెంట్లు సాధించే దిశగా అడుగులు వేయాలని, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని సూచించారు.

ముగింపు ప్రసంగంలో ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. "నేను పెరిగిన, చదువుకున్న ఈ విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఎన్నటికీ మరువవద్దు" అంటూ ఇచ్చిన సందేశం సభికుల హృదయాలను హత్తుకుంది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు పాల్గొని ఆంధ్రా యూనివర్సిటీ ప్రగతిని ప్రశంసించారు. మొత్తానికి ఈ శతాబ్ది ఉత్సవాలు అటు విజ్ఞానాన్ని, ఇటు విలువలని మేళవించి ఘనంగా ముగిశాయి.

Tags:    

Similar News