'298 మందితో వెళ్తోన్న విమానం కూల్చింది రష్యానే'... కోర్టు సంచలన తీర్పు!
అవును... 11 ఏళ్ల కిందట ప్రమాదానికి గురైన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంపై దాడి జరిగిన ఘటనపై కోర్టు తీర్పు వెలువడించింది.;
సుమారు 11 ఏళ్ల కిందట.. 2014, జులై 17న మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం ఆమ్ స్టర్ డామ్ నుంచి కౌలాలంపూర్ కు 298 ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తుండగా ఉక్రెయిన్ గగనతలంలో క్షిపణి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుమతితో ఆ దేశం అందించిన క్షిపణులతో ఉక్రెయిన్ వేర్పాటువాదులు ఈ దురాగతానికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ.
ఈ విషయంపై గతంలో స్పందించిన అంతర్జాతీయ దర్యాప్తు బృందం సంచలన విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా.. దాడిలో ఉపయోగించిన క్షిపణులు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించినవే అని పేర్కొంది. ఈ ఘటనలో పుతిన్ జోక్యం ఉందనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా కోర్టు సంచలన తీర్పు వెలువడించింది.
అవును... 11 ఏళ్ల కిందట ప్రమాదానికి గురైన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంపై దాడి జరిగిన ఘటనపై కోర్టు తీర్పు వెలువడించింది. ఇందులో భాగంగా.. ఆ విమానం కూల్చింది రష్యానేనని ఐరోపాకు చెందిన హ్యూమన్ రైట్స్ కోర్టు తాజాగా ఈ తీర్పు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఆ విమానంపై దాడి చేశారని, బహుశా అది సైనిక విమానంగా భావించి ఉండొచ్చని తన తీర్పులో పేర్కొంది.
మరోవైపు గతేడాది డిసెంబర్ లో అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన జె2-8243 విమానం కుప్పకూలిన ఘటనలోనూ రష్యా పాత్ర ఉందనే విషయం తెరపైకి వచ్చింది. నాడు అజర్ బైజాన్ దేశ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నికి బయల్దేరిన విమానం కజఖిస్థాన్ లో ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా.. 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆ సమయంలో కూడా ఈ ఘటనకు రష్యానే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే... ప్రమాదానికి తామే కారణమని వస్తున్న ఆరోపణలను అంగీకరించలేదు కానీ... దీనిపై పుతిన్ క్షమాపణలు మాత్రం చెప్పారు. మరోవైపు రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైందని అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే మలేషియా ఎయిర్ లైన్స్ విషయంలోనూ రష్యా అంగీకరించడం లేదని అంటున్నారు. అంతర్జాతీయ దర్యాప్తు బృందంలో రష్యా భాగస్వామిగా లేనందున.. ఆ దర్యాప్తు ఫలితాను తాము అంగీకరించలేమని చెబుతోంది. ఈ తాజా తీర్పును రష్యా తోసిపుచ్చింది. మరోవైపు ఉక్రెయిన్ మాత్రం ఈ తీర్పు తమ గొప్ప విజయం అభివర్ణించింది.