డాలర్ దెబ్బకు రూపాయ్ ఢమాల్
మన రూపాయ్ ఆల్ టైం రికార్డుని క్రియేట్ చేసింది. అత్యంత కనిష్టానికి చేరింది. రూపాయి దిగజారుడుకు పాతాళం అంచులే హద్దులు అన్నట్లుగా లోలోతుల్లోకి పడిపోతోంది.;
మన రూపాయ్ ఆల్ టైం రికార్డుని క్రియేట్ చేసింది. అత్యంత కనిష్టానికి చేరింది. రూపాయి దిగజారుడుకు పాతాళం అంచులే హద్దులు అన్నట్లుగా లోలోతుల్లోకి పడిపోతోంది. ఒక విధంగా చెప్పాలంటే కృంగి కృశిస్తోంది.
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 90 కి పై దాటిందని అంటున్నారు. ఇంతలా రూపాయి పతనం కావడానికి కారణాలు ఏమైనా ఇది రూపాయి తీవ్రంగా సుస్తీకి గురి అయింది అనడానికి నిఖార్సు అయిన ఆధారాలుగా చెబుతున్నారు.
రూపాయి డీలా :
భారతీయ రూపాయి అమెరికా డాలర్ దెబ్బకు డీలా పడి దిగాలుగా చూస్తోంది. ఫారెక్స్ మార్కెట్ లో ఈ బుధవారం రూపాయి డాలర్ తో పోలిస్తే 90.14 పైఅసలకు పడిపోయింది అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక నిన్నటికి నిన్న మంగళవారం రూపాయి 89.96 వద్ద నమోదు అయితే ఒక్క రోజు తేడాలో మరింత పతనానికి చేరుకోవడమే చిత్రాతిచిత్రంగా ఉంది. దీంతో భారతీయ రూపాయికి అంతర్జాతీయ మార్కెట్ లో విలువ తగ్గిపోతోంది. విదేశీ మారక ద్రవ్యానికి కూడా విలువ అదే సమయంలో పడిపోతోంది.
వేగంగా బలహీనం :
భారతీయ రూపాయి ఎందుకు పతనం అవుతోంది అంటే అనేక కారణాలను నిపుణులు చెబుతున్నారు. విదేశీ పెట్టుబడులు ఇటీవల కాలంలో తగ్గాయి. ఇక అమెరికా భారత్ ల మధ్య వాణిజ్య బంధాలు నిలిచిపోయాయి. అధిక సుంకాలను అమెరికా విధిస్తూ భారత్ ఆర్ధికత మీద ప్రభావం చూపిస్తోంది. మన ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గితే రూపాయి బలంగా ఉంటుంది. కానీ అదేమీ జరగడం లేదు. ఇక అనేక విషయాలలో పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకునే నేపథ్యం ఉంది. దాంతో వాటి కోసం డాలర్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా రూపాయి క్షీణతకు అనేక రకాలైన వత్తిళ్ళు పనిచేస్తున్నాయి అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
అనాడు విమర్శలు :
ఇక ఇప్పటికి పుష్కర కాలం క్రితం దేశాన్ని ఏలైన ఆర్థిక మేధావి మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయి పతనం పెద్ద ఎత్తున ఉందని విమర్శలు చేసిన వారే ఈ రోజు దేశాన్ని ఏలుతున్నారు అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మన్మోహన్ సింగ్ పాలనలో రూపాయి డాలర్ తో పోలిస్తే 50 రూపాయలు విలువ కలిగి ఉంది. కేవలం 12 ఏళ్ళలో రెట్టింపు అవడం ఎవరి నిర్వాకం అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా దేశ భక్తిగానే చూడాలా ని నిలదీస్తున్నారు. ఆర్ధికంగా దేశాన్ని గాడిన పెట్టలేని పరిస్థితి ఉందా అన్న చర్చ కూడా చేస్తున్నారు.
మన గొప్పలు అన్నీ :
భారత దేశం జాతీయ వృద్ధి రేటు జీడీపీ ఎంతో బాగా ఉందని ఒక వైపు ఊదరగొడుతున్న పాలకులు ఈ రకమైన పతనాన్ని చూసి ఏమి జవాబు చెబుతారు అన్నది సూటి ప్రశ్నగా ఉంది. మన విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. మన రూపాయి దారుణంగా పతనం అవుతోంది. రూపాయి ఇంతలా దిగాజరుతూ పోతే దేశ ఆర్ధిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికీ డాలరే :
ఇక అమెరికా డాలర్ ఈ రోజుకీ ప్రపంచ మార్కెట్ ని పాలిస్తోంది. డాలర్ కి ఆల్టర్నేషన్ అన్నది లేకుండా పాతోంది. అలాంటి దానిని తేవాలని జరిగిన ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతున్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ శాసిస్తోంది. డాలర్ ఎపుడు స్పీడ్ పెంచినా అది ప్రపంచ దేశాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు ఇబ్బందులో పడుతున్నాయి. భారత్ చైనా రష్యా వంటి దేశాలు డాలర్ కి ఆల్టర్నేషన్ గా కొత్త కరెన్సీని తేవాలని చూస్తున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. దీంతో డాలర్ దెబ్బ తినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే రూపాయి పతనం ఇదే తీరున సాగితే మాత్రం మన రూపాయి 91, 92 కి కూడా తొందరలోనే పడిపోతుంది అని అంటున్నారు. చూడాలి మరి రూపాయిని ఎలా కాపాడుతారో ఏమి చేస్తారో.