నొప్పిని గ్రహించే రోబోలు.. ప్రమాదాన్ని కూడా పసిగట్టగలవోయ్..

Update: 2026-01-06 22:30 GMT

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమాలో రోబోకి స్పర్శ జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు శంకర్. అయితే ఇప్పుడు దానిని నిజం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఈ రోబోలకు స్పర్శను గ్రహించే జ్ఞానమే కాదు నొప్పిని కూడా గ్రహించే శక్తి ఉంటుందట. అంతేకాదు జరిగే ప్రమాదాన్ని కూడా ముందే పసిగట్టగలిగే టాలెంట్ ను ఈ రోబోలలో అభివృద్ధి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇకపోతే అభివృద్ధి విషయంలో ఎప్పుడూ ముందుండే జపాన్ ను ఈసారి చైనా శాస్త్రవేత్తలు బీట్ చేశారు.సరికొత్తగా ఎలక్ట్రానిక్ స్కిన్ ను అభివృద్ధి చేశారు. ఇది రోబోలకి స్పర్శ జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా నొప్పిని గ్రహించే లక్షణాన్ని కూడా ఇస్తుందట. చైనాలోని హాంకాంగ్ సిటీ విశ్వవిద్యాలయం ఇంజనీర్ యుయు గావో నేతృత్వంలో ఈ "ఈ - స్కిన్" ను అభివృద్ధి చేశారు. మానవ నాడీ వ్యవస్థ లాగే ఖచ్చితంగా పనిచేసే న్యూరోమార్ఫిక్ టెక్నాలజీ ఆధారంగానే దీనిని తయారు చేశారట.ముఖ్యంగా ఈ ఈ - స్కిన్ తో తయారైన రోబో ఏదైనా వేడి లేదా చల్లని వస్తువును తన చేతితో తాకిన వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంటుంది .

ముఖ్యంగా ఈ కృత్రిమ చర్మాన్ని నాలుగు యాక్టివ్ లేయర్స్ తో తయారు చేశారు.. ఎవరైనా ఈ చర్మాన్ని తాకితే ఆ స్పర్శ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గా మారుతుంది. మానవుడి మెదడుకి నరాలు పంపించే సంకేతాల వంటివే ఈ సంకేతాలు కూడా.. ముఖ్యంగా స్పర్శ ఒత్తిడి తేలికగా ఉంటే అది సాధారణమైన స్పర్శ అని భావించి తన పని తాను కొనసాగిస్తుంది. ఒకవేళ పరిమితికి మించి ఒత్తిడి పెరిగితే దానిని నొప్పిగా గుర్తించి వెంటనే ప్రతిస్పందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇకపోతే సాధారణ రోబోలు చేసే ప్రతి పని దాని మెదడు (సెంట్రల్ ప్రాసెసర్) ద్వారా జరుగుతుంది. దీనికి సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ - స్కిన్ లో నేరుగా మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకే తీవ్రమైన నొప్పి లేదా గాయం తగిలిన వెంటనే నొప్పి అనే భావనను ఆ సంకేతాలు రోబో మోటార్స్ కి నేరుగా హై వోల్టేజ్ పల్స్ ను పంపిస్తాయి. ఫలితంగా రోబో అవయవాలు తక్షణమే స్పందించి వెనక్కి వెళ్తాయి. ముఖ్యంగా స్పర్శ జ్ఞానం వల్ల ప్రమాదాలను కూడా ఆ రోబో పసిగట్టగలదు. ఇకపోతే ఇలాంటి రోబోలు వాడుకలోకి వస్తే ఫ్యాక్టరీ ప్రమాదాలను తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో యుద్ధాలు , రెస్క్యూ ఆపరేషన్లలో కూడా వీటిని ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రోబోల వాడకం కూడా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News