పాత ప్రచారమే సరికొత్తగా.. ఆర్కే రోజాకే ఎందుకిలా?

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్.కే.రోజా తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని మరోసారి ప్రచారం ఎక్కువవుతోంది.;

Update: 2026-04-13 22:30 GMT

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్.కే.రోజా తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని మరోసారి ప్రచారం ఎక్కువవుతోంది. ఏడాదిన్నర క్రితమే మొదలైన ఈ ప్రచారం పూర్తి అసత్యమంటూ రోజా స్పష్టం చేస్తున్నా, ఆమె లక్ష్యంగా సాగుతున్న ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో రోజాకు నగరి టికెట్ దక్కడం అనుమానమే అని, నియోజకవర్గానికి చెందిన ద్వితీయశ్రేణి కేడర్ మొత్తం ఆమెను వ్యతిరేకిస్తోందని కొద్దిరోజులుగా భారీ ఎత్తున ఊహాగానాలను వ్యాప్తి చేస్తున్నారు. ఈ కారణంగా ఆమెకు టికెట్ ఇవ్వనంటున్నారని, దీంతో రోజా రాష్ట్ర రాజకీయాలను వదిలేసి తమిళనాడు పాలిటిక్స్ కు షిప్ట్ అవుతున్నారని ప్రచారం చేస్తున్నారు.

రోజా టార్గెట్ గా సాగుతున్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రోజా సొంత నియోజకవర్గం నగరిలో వైసీపీలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు ఏవీ లేకపోయినా, రోజాను లక్ష్యంగా చేసుకుని గిట్టనివారు ఈ ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో మాజీ మంత్రి రోజాకు అభిప్రాయ భేదాలు ఉండేవని, ఈ విషయమై అధిష్టానానికి సమాచారం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రోజాతో విభేదించిన వారు పార్టీకి దూరమయ్యారని, ప్రస్తుతం రోజాను సమర్థిస్తున్నవారే నియోజకవర్గంలో ఉన్నారని చెబుతున్నారు.

అయితే దీనికి పూర్తి భిన్నమైన ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోందని అంటున్నారు. రోజా తమిళనాడు పాలిటిక్స్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కొన్ని సర్కిల్స్ లో ప్రచారం చేస్తున్నారు. అయితే తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ప్రచారం జరగడమే అనుమానాలకు తావిస్తోంది. రోజాను రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహంతో ఆమె ప్రత్యర్థులు మళ్లీ ఈ ప్రచారానికి తెరతీశారా? అంటూ చర్చ జరుగుతోంది.

కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో రోజా తమిళనాడు రాజకీయాలకు వెళ్లిపోతున్నారని ప్రచారం చేశారు. దీనిని ఆమె ఖండిస్తూ తాను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు రోజా భర్త సెల్వమణి తమిళ జాతీయ వాదానికి మద్దతుగా మాట్లాడుతుండటాన్ని పట్టుకుని రోజా కూడా అటు వైపు షిప్ట్ అవుతున్నారని మళ్లీ మొదలుపెట్టారని అంటున్నారు. సెల్వమణి స్వరాష్ట్రంలో జరిగే రాజకీయాలకు రోజాకు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. రోజాను దెబ్బతీయాలనే వ్యూహంతో ఆమె ప్రత్యర్థులు ఇలాంటి చేస్తున్నారని అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News