'ఆడుదాం-ఆంధ్ర' రిపోర్టు రెడీ.. రోజా వంతు వచ్చేసిందా?

మొత్తానికి మాజీ మంత్రి ఆర్కే రోజాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.;

Update: 2025-08-10 07:52 GMT

వైసీపీ నేతల అరెస్టుల పరంపరలో మరో మాజీ మంత్రి వంతు వచ్చిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నారు. ‘ఆడుదాం-ఆంధ్ర’ స్కాంలో రోజాను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. శాప్ చైర్మన్ రవినాయుడు ఫిర్యాదు మేరకు ‘ఆడుదాం-ఆంధ్ర’ స్కాంపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారని చెబుతున్నారు. నిధుల దుర్వినియోగాన్ని నిర్ధారించడంతో కేసు నమోదుకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉందని అంటున్నారు.

రూ. వంద కోట్ల అవినీతి?

గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం పేరిట సుమారు రూ.119 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో దాదాపు రూ.100 కోట్ల మేర అవినీతి జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తితోపాటు శాప్ చైర్మన్ రవినాయుడు కూడా ఇదే ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విచారణకు ఆదేశించింది. దీనిపై విజిలెన్స్ అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో వారు సుదీర్ఘ విచారణ జరిపి అవకతవకలు నిజమేనంటూ నివేదిక రెడీ చేసినట్లు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ నివేదిక డీజీపీ ద్వారా ప్రభుత్వానికి అందివ్వనున్నారని అంటున్నారు.

45 రోజుల్లోనే కోట్ల ఖర్చు

క్రీడా పోటీలకు సంబంధించి పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా అవినీతి చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అప్పటి క్రీడా మంత్రిగా పనిచేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాపై అభియోగాలు మోపే అవకాశం ఉందంటున్నారు. కేవలం 45 రోజుల్లోనే రూ.119 కోట్లు ఖర్చు చేయడంపై ప్రభుత్వం, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ కుంభకోణంలో సుమారు 400 కోట్ల కుంభకోణం జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు. అయితే రూ.119 కోట్లు కేటాయిస్తే రూ.400 కోట్లు అవినీతి ఎలా జరిగిందని వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనికి సమాధానంగా జిల్లా క్రీడా సంఘాల నుంచి ఖర్చుచేసిన మొత్తం కూడా ఈ స్కాం కిందకే వస్తుందని టీడీపీ చెబుతోంది. దీంతో విజిలెన్స్ నివేదికలో ఎంత మొత్తం అవినీతిని గుర్తించారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.

రోజాకు బిగిస్తున్న ఉచ్చు

మొత్తానికి మాజీ మంత్రి ఆర్కే రోజాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి పలు కేసుల్లో రోజాను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. ప్రధానంగా ఆమెపై అనుచిత వ్యాఖ్యల కేసులను నమోదు చేస్తారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీటీడీ దర్శనాల విషయంలోనూ రోజాపై విమర్శలు ఉండటంతో ఆ దిశగాను చర్యలు తీసుకోవచ్చని అనుకున్నారు. కానీ, అవినీతి వ్యవహారంలోనే ఆమెను అరెస్టు చేస్తారని ఎక్కువగా నమ్ముతున్నారు. దీంతో ఆడుదాం-ఆంధ్ర స్కాంలో రోజాపై చర్యలు ఉంటాయని ఊహిస్తున్నారు.

Tags:    

Similar News