ఎదురుగాలిలో ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని తీసుకున్న సునాక్

గాలి వాటంగా వీస్తున్న వేళ అధికారంలోఉన్న వారు ముందస్తుకు వెళ్లే సాహసం చేస్తుంటారు.

Update: 2024-05-23 04:46 GMT

గాలి వాటంగా వీస్తున్న వేళ అధికారంలోఉన్న వారు ముందస్తుకు వెళ్లే సాహసం చేస్తుంటారు. అందుకు భిన్నమైన వాతావరణం నెలకొని ఉంటే.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు మక్కువ చూపుతారు. వీలైనంత వరకు వాతావరణాన్ని తమకు తగ్గట్లు మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు భిన్నంగా సాహసోపేతమైన నిర్ణయంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్. ముందస్తు ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన చేసిన ఆయన.. పోలింగ్ డేట్ ఫిక్స్ చేశారు. జులై నాలుగున సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.

ముందస్తుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని రాజు చార్లెస్ 3కు చెప్పానని.. పార్లమెంట్ రద్దుకు అనుమతించినట్లుగా వెల్లడించారు. ఆరు వారాల్లో ఎన్నికలకు వెళుతున్నట్లుగా చెప్పిన రిషి.. పోల్ డేట్ ను ఫిక్స్ చేసేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జూన్ 4న మన దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏం తీర్పు ఇచ్చారన్నది తేలనుంది. సరిగ్గా.. తర్వాతి నెలలో ఇదే డేట్ కు బ్రిటన్ లో ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుంది.

ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లుగా ప్రకటన చేసిన రిషి.. ఈ సందర్భంగా తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని వెల్లడించారు. వీలైనంత భద్రత ఇవ్వటానికి తన అధికార పరిధికి లోబడి చేయాల్సిందంతా చేస్తానని.. ఇది తాను ఇచ్చే హామీగా పేర్కొన్నారు. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిదేనంటూ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. ఇక్కడ అందరిని ఆశ్చర్యపరుస్తున్న అంశం ఏమంటే.. రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్వర్జేటివ్ పార్టీకి ఎన్నికల్లో ఓటమి తప్పదంటూ పలు సంస్థలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి.

Read more!

విపక్ష లేబర్ పార్టీకి ఈసారి స్పష్టమైన మెజార్టీ ఖాయమని.. ఎన్నికలు అంటూ జరిగితే లేబర్ పార్టీనే విజయం సాధించటం ఖాయమని తేల్చి చెబుతుననారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు.. ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ వరుస పెట్టి విజయాల్ని సొంతం చేసుకుంటుంది. ఇలాంటి వ్యతిరేక గాలి వీస్తున్న వేళ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన సాహసోపేతమైనదిగా చెప్పక తప్పదు.

ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ముందస్తుపై సంచలన ప్రకటన చేయటానికి కొన్ని గంటల ముందు పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. దేశంలో ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉంటుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. 2025 జనవరి లోపు ఎన్నికల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడన్న సంగతి తెలిసిందే. మన దేశాన్ని నాలుగు వందల ఏళ్లకు పైగా పాలించిన బ్రిటన్ దేశానికి మన దేశ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధానమంత్రి కావటం అప్పట్లో సంచలనంగా మారటం తెలిసిందే.

పార్లమెంటులో ఎన్నికలుఇప్పట్లో కాదన్నట్లుగా ప్రకటన చేసిన రిషి.. కాసేపటికే ఆకస్మికంగా కేబినెట్ భేటీని నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ భేటీ కోసం విదేశాల్లో ఉన్న పలువురు మంత్రులు హుటాహుటిన బ్రిటన్ చేసుకున్నారు. తమ విదేశీ పర్యటనల్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం.. డౌన్ స్ట్రీట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రిషి.. ముందస్తు ఎన్నికల ప్రకటనతో పాటు పోలింగ్ జులై 4న నిర్వహించనున్నట్లుగా చెప్పి సంచలనంగా మారారు. ఎదురుగాలిలో తీసుకున్న ముందస్తు నిర్ణయం రిషిని ఏ దరికి చేరుస్తుందో చూడాలి.

Tags:    

Similar News