ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చాలా పెద్ద త‌ప్పు చేశారు: రేవంత్‌పై అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పేరు చెప్ప‌కుండానే తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేంద్ర హోం మంత్రి

Update: 2024-04-30 13:30 GMT

పేరు చెప్ప‌కుండానే తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేంద్ర హోం మంత్రి.. బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ''ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌ప్పు చేశారు. పాల‌కు పాలు.. నీళ్ల‌కు నీళ్లు.. అన్న‌ట్టుగా వాస్త‌వాలు ఏంటో తేలాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే స‌మ‌న్లు ఇచ్చి ఉంటారు'' అని తాజాగా అమిత్ షా మీడియాకు వెల్ల‌డించారు.

సోమ‌వారం రాత్రి.. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోలీసులు సీఆర్ పీసీ సెక్ష‌న్ 91(ఏ) కింద స‌మ‌న్లు జారీ చేశారు. మే 1న ఢిల్లీలో నిర్వ‌హించనున్న విచార‌ణ‌కు రావాల‌ని.. వ‌చ్చేప్పుడు సంబంధిత ఆధారాల‌ను కూడా తీసుకురావాల‌ని.. స‌మ‌న్ల‌లో పేర్కొన్నారు. దీంతో రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారా? అనే సందేహాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో త‌లెత్తాయి. ఇప్ప‌టికే ప‌లువురు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌ను కూడా అరెస్టు చేసిన ద‌రిమిలా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ అరెస్టు ఉంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అమిత్‌షా.. ''నేను సిద్దిపేట‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు.. నేను అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టుగా ప్ర‌చారం చేశారు. నా మాట‌ల‌ను మార్ఫింగ్ చేశారు. ఇది క్ష‌మించ‌రాని నేరం. దీనిలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉన్నారు. ఆయ‌న చాలా పెద్ద త‌ప్పు చేశారు. దీనిని స‌హించేది లేదు. పాల‌కు పాలు.. నీళ్ల‌కు నీళ్లు ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిందే. మేం మ‌త ప్రాదిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు ఇచ్చేందుకు వ్య‌తిరేకం. ఇది రాజ్యాంగంలోనే ఉంది. దీనిని వ‌దిలేసే ప్ర‌శ్నే లేదు'' అని అమిత్ షా తేల్చి చెప్పారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం చూస్తే.. రేవంత్ కేంద్రంగా ఉచ్చు బిగిస్తున్న‌ట్టుగానే భావించాలి. మ‌రి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Tags:    

Similar News