సంతోష్ రావు విషయంలో సీఎం రేవంత్ చెప్పిన మాటలో నిజమెంత?

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే సంతోష్ రావుకు ప్రగతిభవన్ లో ప్రాధాన్యత తగ్గిందని తెలుస్తోంది.

Update: 2024-04-28 11:30 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో పదును ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి ఎవరైనా చిక్కనైనా వాదన.. అన్ని వర్గాల వారు కనెక్టు అయ్యేలా లాజిక్ చూపించటంతో పాటు.. తాను చెప్పే అంశానికి సంబంధించిన అంశాల్ని ప్రస్తావించటం ద్వారా అందరూ ఆమోదించేలా ఆయన వాదన ఉంటుంది. రాజకీయంగా విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు మహా కఠినంగా ఆయన తీరు ఉంటుంది. ఘాటు విమర్శలు చేయటానికి ఆయన అస్సలు సంకోచించరు.

అంతేకాదు.. రేవంత్ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు తూటాల మాదిరి పేలుతుంటాయి. ఆయా అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ మొదలవుతుంది. తాజాగా అలాంటి మాటే ఒకటి రేవంత్ నోటి నుంచి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఇటీవల కాలంలో కేసీఆర్ వద్ద కనిపించట్లేదని.. ఆయన కూడా సెలవు పెట్టి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. కేసీఆర్ బాగోగులున్నీ చూసుకునే సంతోష్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ను వీడి వెళ్లిపోయారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.

Read more!

అధికారంలో ఉన్న వేళలో.. కేసీఆర్ కు నీడలా ఉంటూ.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండటమేకాదు.. నీడలా ఫాలో అయ్యే సంతోష్.. ఇప్పుడు హటాత్తుగా దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. వాస్తవం ఏమిటి? సీఎం రేవంత్ మాటల్లో నిజం ఎంత? అన్న విషయంలోకి వెళితే.. రేవంత్ చెప్పిన మాటల్లో సగం మాత్రమే నిజం ఉందంటున్నారు. అలా అని సగం అబద్ధం ఉందని కూడా చెప్పలేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే సంతోష్ రావుకు ప్రగతిభవన్ లో ప్రాధాన్యత తగ్గిందని తెలుస్తోంది.

ఆయన స్థానాన్ని మరో ఎమ్మెల్సీ భర్తీ చేశారని చెబుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండే సదరు ఎమ్మెల్సీని ప్రగతి భవన్ లో ఉంచటం.. కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉండేలా ప్లాన్ చేశారని చెబుతారు. సదరు ఎమ్మెల్సీ ఎంట్రీ తర్వాత నుంచి సంతోష్ కు ప్రాధాన్యత తగ్గినట్లుగా చెబుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం తెర మీదకు రావటం.. కవిత అరెస్టు కావటం లాంటి అంశాలు కూడా సంతోష్ ఇమేజ్ కేసీఆర్ దగ్గర డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తోంది. తన వెన్నంటే ఉన్నప్పటికీ.. కొన్ని అంశాల్లో తనను అలెర్టు చేసే విషయంలో సంతోష్ రావు వ్యవహరించిన తీరుపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. కేసీఆర్ కు సంతోష్ కాస్త దూరంగా ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశాన్నితాజాగా రేవంత్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారని చెప్పాలి.

Tags:    

Similar News