పదేళ్ళు నేనే...రేవంత్ స్ట్రాటజీ అదుర్స్
ఎవరైనా అధికారంలో ఉన్నపుడు తమకు తిరుగులేదని అనుకుంటారు. తామే ఎల్లకాలం ఉంటామని భావిస్తారు.;
ఎవరైనా అధికారంలో ఉన్నపుడు తమకు తిరుగులేదని అనుకుంటారు. తామే ఎల్లకాలం ఉంటామని భావిస్తారు. అయితే అధికారంలోకి వచ్చినంత మాత్రంలో గెలుపు మళ్ళీ మళ్ళీ తలుపు తట్టదు అన్నది ఎలా ఉందో అలాగే ఓటమి కూడా లేకుండా గెలుపు గుర్రాలు ఎక్కిన సీఎంల చరిత్ర చాలానే ఉంది. దాంతో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా తనది అదే బాట అంటున్నారు. ఆయన ఈ మాట ఇప్పటికి ఎన్నో సార్లు అన్నారు. తాజాగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలసి వచ్చారు. ఆ తర్వాత మీడియాతో ఆయన చిట్ చాట్ చేస్తూ అనేక విషయాల మీద తన ఆలోచనలను పంచుకున్నారు. తెలంగాణా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా ఆయన తన ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు.
రెండేళ్ళ సీఎం గా :
ఇక ఈ నెల 9న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండేళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. 2023లో ఆయన ఇదే రోజున సీఎం అయ్యారు. ఆయన రాజకీయ జీవితంలో మంత్రి పదవి చేపట్టకుండా నేరుగా సీఎం అయి రికార్డు క్రియేట్ చేశారు. మంచి వక్తగా ఉన్నారు దూకుడు రాజకీయాలు చేస్తారు. తెలంగాణాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా ఆయన కనిపిస్తారు. అంతే కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ బలాన్ని కూడా అంచనా వేసుకుంటున్నారు. అలాగే ప్రత్యర్ధుల బలాలను బలహీనతలను కూడా విశ్లేషించుకుంటున్నారు.
ఇదీ రాజకీయం :
తెలంగాణలో కాంగ్రెస్ కి మంచి ఓటు బ్యాంక్ ఉంది. బూత్ లెవెల్ దాకా పార్టీ విస్తరించి ఉంది. ఆ తరువాత బీఆర్ ఎస్ కూడా ఉంది. ఇక మూడవ ఆల్టర్నేషన్ గా వస్తున్న బీజేపీకి పట్టణాలలో కొన్ని చోట్ల బలం ఉంది. అయితే రూరల్ లో ఇంకా బలపడాల్సి ఉంది. మరో వైపు చూస్తే బీఆర్ ఎస్ కి కేసీఅర్ నాయకత్వమే శ్రీరామరక్ష. అయితే కేసీఅర్ ఇపుడు పెద్దగా జనంలోకి రావడం లేదు, ఆయన వారసులు ఎవరు అన్నది ఇంకా జనం తేల్చాల్సి ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. అలాగే మేనల్లుడు హరీష్ రావు తనకంటూ ముద్ర వేసుకున్నారు. కుమార్తె కవిత బీఆర్ ఎస్ కి దూరం జరిగి తన దారి తాను చూసుకుంటున్నారు. ఇలా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయం అయితే ఒక విధంగా అస్పష్టంగా ఉంది. యాంటి ఓటు అన్నది చీలిపోయి ఉందని చెప్పాల్సి ఉంది.
పోటీ లేనట్లేనా :
ఇక కాంగ్రెస్ లో చూస్తే రేవంత్ రెడ్డి యువ నేత కిందనే లెక్క. ఆయన కంటే వయసులో పెద్ద వారే ఎక్కువ మంది నేతలు ఉన్నారు. దాంతో రానున్న కాలంలో చూస్తే రేవంత్ రెడ్డి మరింత కీలకం అవుతారు అని అంటున్నారు. హై కమాండ్ కి కూడా రేవంత్ రెడ్డి మీద గురి బాగా ఉంది. ఇక జనంలో కూడా ఆకర్షణీయమైన నేతగా ఆయన ఉన్నారు. ఈ మధ్యనే జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కనీ వినీ ఎరగని విధంగా కాంగ్రెస్ కి మెజారిటీ తెచ్చేలా చూశారు. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా పూర్తి అయితే కాంగ్రెస్ మరింతగా స్ట్రాంగ్ అవుతుంది అన్నది కూడా ఉంది. దాంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 2028 ఎన్నికల్లో కూడా మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తున్నారు.
ట్రాక్ రికార్డు అలా :
ఇక తెలంగాణా సమాజం కనుక ఒక పార్టీని గెలిపిస్తే కనీసంగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంచుతోంది. ఇది గతంలో ఉమ్మడి ఏపీలో కూడా జరిగింది. చంద్రబాబు రెండు సార్లు వైఎస్సార్ రెండు సార్లు గెలిచినా తెలంగాణాలోనే ఎక్కువ ఓట్లూ సీట్లూ ఆ పార్టీలకు దక్కాయి అని చెబుతారు. అలాగే విభజన తరువాత కేసీఆర్ కి రెండు చాన్సులు ఇచ్చారు. అదే విధంగా రేవంత్ కి కూడా ఇస్తారు అన్నది ఉంది. ఆ మాటను కూడా ఆయన అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు. మరో వైపు కాంగ్రెస్ అధినాయకత్వానికి బలమైన యువ నేతల అవసరం ఉంది. దాంతో రేవంత్ రెడ్డికి కూడా అది అడ్వాంటేజ్ అవుతోంది. మొత్తానికి తెలంగాణాలో త్రిముఖ పోరు ఉన్నంత కాలం కాంగ్రెస్ కి తిరుగు ఉండదు, అదే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ పట్ల గురి ఉంచిన నేపధ్యంలో రెండవసారి తానే సీఎం అని ఆయన చెప్పడంలోనూ ధీమా గట్టిగానే ఉంది అని అంటున్నారు.