బీఆర్ఎస్ కాదు బీజేపీ...రేవంత్ దూకుడు !

తెలంగాణాలో బీజేపీకి ఎంత బలం ఉంది అన్నది తెలిసిందే. ఆ పార్టీ 2024లో గెలిచిన ఎనిమిది ఎంపీ సీట్ల తరువాత మళ్ళీ కొత్తగా గెలిచింది పెద్దగా కనిపించలేదు.

Update: 2026-06-10 00:30 GMT

తెలంగాణాలో బీజేపీకి ఎంత బలం ఉంది అన్నది తెలిసిందే. ఆ పార్టీ 2024లో గెలిచిన ఎనిమిది ఎంపీ సీట్ల తరువాత మళ్ళీ కొత్తగా గెలిచింది పెద్దగా కనిపించలేదు. అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ వెనకబడింది. స్థానిక ఎన్నికల్లో సైతం బీఆర్ ఎస్ కంటే బాగా వెనక్కి ఉంది. అలాంటి బీజేపీ తెలంగాణాలో తృతీయ పక్షంగానే ఉంది కానీ ఇంకా ముందుకు రాని నేపథ్యం ఉందని అంటున్నారు. కానీ ఉన్నట్లుండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ని వదిలేసి బీజేపీ మీద పడడం అయితే రాజకీయంగా చర్చగా మారింది.

కిషన్ రెడ్డి టార్గెట్ :

ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు నుంచి లేరు ఆయన 2014 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మొదట సహాయ మంత్రిగా ఆ తరువాత కేబినెట్ మంత్రిగా ఉంటూ మోడీ ప్రభుత్వంలో వరసగా తన పదవిని కొనసాగిస్తున్నారు. ఇక కిషన్ రెడ్డి ఎక్కువగా విమర్శలు చేసే వారు కారు, పైగా ఆయన ఢిల్లీ టూ హైదరాబాద్ తిరుగుతూ బిజీగా ఉంటారు. ఆయన బీజేపీ బాధ్యతలను కూడా ఒక దశలో ఎత్తుకున్నారు. కానీ తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ గా రామచంద్రరావుకు ఆ పదవి ఇచ్చారు. ఇక ఏమి చూసుకున్నా రామచంద్రరావు చూసుకుంటూ మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలోనే కిషన్ రెడ్డి రెస్పాండ్ అవుతున్నారు. అలాంటి కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఆయనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నదే చర్చగా ఉంది.

కార్నర్ చేస్తూనే :

ఇక ధాన్యం తెలంగాణాలో పండిస్తే దానికి కేంద్రం కొనడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏకంగా 75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు మెట్రో రైలు విస్తరణ పనులతో పాటు మూసీ నది సుందరీకరణకు కూడా కేంద్రం సహకరించడం లేదని కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోరా అని కూడా నిలదీస్తున్నారు. తుమ్మడి హట్టి ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో చర్చించేందుకు కిషన్ రెడ్డి సహకరించాలని కూడా కోరుతున్నారు.

అలా ఎందుకు అంటే :

మొత్తానికి బీజేపీని తెలంగాణాలో కార్నర్ చేసేందుకు రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో సీఎం మార్పు జరిగింది. మరో వైపు చూస్తే బీజేపీ సౌత్ ఫోకస్ పెరిగిందని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత తెలంగాణా మీదనే బీజేపీ దృష్టి పెడుతోందని కూడా అంటున్నారు. ఇక తొందరలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ బీజేపీకి బలం ఉంది. దాంతో బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా అన్ని విధాలుగా రాజకీయంగా సరైన వ్యూహం అని భావించే రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు బీజేపీని ఎంత పెంచితే బీఆర్ఎస్ కొంత తగ్గుతుంది. అపుడు ట్రయాంగిల్ ఫైట్ తెలంగాణాలో జరుగుతుంది. అది కాంగ్రెస్ కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది, ఆ విధంగా 2028 ఎన్నికలను ఎదుర్కోవచ్చు అన్నది కూడా భారీ ప్లాన్ గా ఉందని అంటున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి బీజేపీ మీద కిషన్ రెడ్డి మీద చేస్తున్న హాట్ కామెంట్స్ అయితే తెలంగాణాలో రాజకీయంగా కలకలం రేపుతున్నాయి అని చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News