'గత పాలకులు..' అంటూ కేసీఆర్‌పై రేవంత్ ఓ రేంజ్‌లో..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా 'గత పాలకులు' అంటూ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా 'గత పాలకులు' అంటూ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. పాలమూరులో నిర్వహించిన ప్రజాపాలన ఉత్సవాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి స్థానికులు భారీ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ''గత పాలకులు పాలమూరును.. నిర్లక్ష్యం చేశారు. ఆ పెద్దాయనపై ఎన్నో ఆశలతో రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసినా.. మక్తల్‌ను పట్టించుకోలేదు. అనేక విషయాల్లో వివక్ష చూపించారు. దీంతో పాలమూరు బిడ్డలు నన్ను ముఖ్యమంత్రిని చేశారు.'' అని వ్యాఖ్యానిం చారు.
తమ హయాంలో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి బాట పట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ ఒక్క నియోజకవర్గాన్నీ విస్మరించబోమన్నారు. 'గత పాలకులు.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడి ప్రజలకు నీళ్లు ఇవ్వలేదు. ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు, అధికారం ఇవ్వాలని గత పాలకులు విస్మరించారు.'' అని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గత ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారని.. ఇక్కడి ప్రజల ఆశలను ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. పాలమూరు గడ్డ ప్రమిస్తే.. ప్రాణమిస్తుందన్న రేవంత్ రెడ్డి.. మోసం చేస్తే పాతాళానికి తొక్కేస్తుందని కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
''2009లో పాలమూరు నుంచి ఒకాయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తర్వాత.. సీఎం అయ్యారు. అయినా.. ఇక్కడి వారిని ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు.'' అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. దీంతో ఇక్కడి ప్రజలకు వలస బాట తప్ప మరో దారి కనిపించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. కొడంగల్, నారాయణ పేట ప్రాజెక్టులను ప్రారంభించామ ని.. త్వరలోనే రైతులకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములకు సంబంధించి రైతులు కోరినంత నష్ట పరిహారం అందించామని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
ఇరిగేషన్-ఎడ్యుకేషన్‌కు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చదువు లేకపోవడం వల్లే పాలమూరు వెనుకబడిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలోనూ యంగ్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి పాలమూరులో 14 స్కూళ్లను ఏర్పాటు చేసి.. పిల్లలను విద్యావంతులను చేయను న్నట్టు వివరించారు. కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రతి ఒక్కరికీ అభయ హస్తం అందిస్తామన్నారు.