రాజకీయాల్లో ‘కుర్చీ’కి కాలం చెల్లిందా? నేలపై కూర్చున్న సీఎం రేవంత్ రెడ్డి... అసలు కథేంటి?

సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉన్నామని చెప్పేందుకు సభల్లో వేదికలపై నిలబడి చేతులు ఊపుతారు.. మైకుల్లో హామీలు గుప్పిస్తారు.

Update: 2026-06-02 05:43 GMT

పదవులు, అధికారాల చుట్టూ తిరిగే రాజకీయాల్లో ‘కుర్చీ’ అనేది కేవలం ఒక వస్తువు కాదు... అది ఒక ప్రతిష్ట.. ఒక బలం. అలాంటి కుర్చీ కోసం నాయకులు కొట్లాడుకునే రోజులను చూశాం. కానీ ఆసిఫాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సరికొత్త ‘విజువల్ పాలిటిక్స్’కు తెరలేపింది. అధికారులు ఎంతో శ్రద్ధగా, ప్రొటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేక సీటు సిద్ధం చేశారు. కానీ సీఎం మాత్రం ఆ అధికారిక కుర్చీకి ‘నో థాంక్యూ’ చెప్పేసి నేరుగా మహిళల మధ్యకు వెళ్లి నేలపై కూర్చున్నారు. దీంతో అక్కడున్న కుర్చీలు ఒక్కసారిగా తమ ఉనికిని కోల్పోయి, భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డాయట!

దగ్గరగా అంటే... నిజంగానే దగ్గరగా!

సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉన్నామని చెప్పేందుకు సభల్లో వేదికలపై నిలబడి చేతులు ఊపుతారు.. మైకుల్లో హామీలు గుప్పిస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈసారి ఒక అడుగు ముందుకేసి “దగ్గరగా అంటే మాటల్లో కాదు... చేతల్లో” అన్నట్టుగా మహిళల పక్కనే చాప మీద కూర్చుని ముచ్చటించారు. సీఎం హఠాత్తుగా కింద కూర్చోవడంతో అంతవరకు ప్రొటోకాల్స్, కుర్చీల అమరిక కోసం శ్రమించిన అధికారులు కాసేపు అయోమయంలో పడిపోయారు. ఏర్పాటు చేసిన శ్రమ అంతా వృథా అయిందేమోనని వారు తలలు పట్టుకున్నారు.

సోషల్ మీడియాలో మీమ్స్ జాతర

ఈ దృశ్యాన్ని చూసిన సోషల్ మీడియా సైన్యం ఊరుకుంటుందా? వెంటనే రంగంలోకి దిగి మీమ్స్ వెల్లువెత్తించింది. “కుర్చీ కోసం రాజకీయాలు చేసే రోజులు పోయాయి... ఇప్పుడు కుర్చీని వదిలి రాజకీయాలు చేసే రోజులు వచ్చాయి” అంటూ కొందరు పోస్టులు పెడుతుంటే... మరికొందరు అయితే “కుర్చీలో కూర్చుంటే సీఎం... కింద కూర్చుంటే కామన్ మ్యాన్ సీఎం” అంటూ కొత్త రాజకీయ సిద్ధాంతాలనే కనిపెట్టేశారు. నెటిజన్ల క్రియేటివిటీతో ఈ ఫోటోలు, వీడియోలు కాస్తా నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి.

వ్యూహమా? లేక పబ్లిసిటీ స్టంటా? ప్రతిపక్షాల సెటైర్లు

రాజకీయాల్లో ఏదీ ఊరికే జరగదు... ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ప్రతిపక్షాల కోణంలో చూస్తే ఇది కూడా ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీనే. ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలు దగ్గర పడితే నాయకులు ప్రజల మధ్య కూర్చోవడం, పిల్లలను ఎత్తుకోవడం, హోటళ్లలో టీ తాగడం, పొలం దున్నడం వంటి ‘సంప్రదాయ’ కార్యక్రమాల్లో భాగమేనని సెటైర్లు పేలుస్తున్నారు. ఇంకొంచెం రోజులు ఆగితే బహుశా అధికారులు సీఎం కోసం ఎంత ఖరీదైన సోఫా వేసినా ఆయన మాత్రం చాప మీదే కూర్చుంటారేమో! అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు విసిరారు.

ఇకపై అధికారులకు కొత్త టెన్షన్!

ఏది ఏమైనా ఆసిఫాబాద్ సభలో ప్రధాన ఆకర్షణ ఇందిరమ్మ ఇళ్ల పథకం కంటే... సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్న స్థలమే అయిపోయింది. రాజకీయాల్లో కుర్చీ కోసం జరిగే కురుక్షేత్రాలను చూసిన జనాలకి కుర్చీని పక్కనపెట్టి నేలపై కూర్చున్న సీఎం ఒక కొత్త పాఠం నేర్పారనే చెప్పాలి.

అయితే ఈ సంఘటన తర్వాత అధికారులకు ఒక కొత్త తలనొప్పి మొదలైంది. ఇకపై జరగబోయే సీఎం సభల్లో విఐపి కుర్చీలు వేయాలా? లేక ముందుగానే ఆర్డర్ ఇచ్చి చాపలు, పరుపులు పరచాలా? అన్నది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో నడుస్తున్న అతి పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న!



Tags:    

Similar News