గుంటూరులో చదవలేదు.. గూడుపుఠాణీ చేయలేదు: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై వస్తున్న ట్రోలింగులకు, రాజకీయ విమర్శలకు తనదైన శైలిలో చెక్ పెట్టారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై వస్తున్న ట్రోలింగులకు, రాజకీయ విమర్శలకు తనదైన శైలిలో చెక్ పెట్టారు. తాజాగా ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడారు. అయితే.. దీనిపై ట్రోల్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డికి వచ్చిన ఇంగ్లీష్ ఇదేనంటూ.. సోషల్ మీడియాలోనూ కామెంట్లు కురిశాయి. దీనిపై తాజాగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
''కొందరు నన్ను హేళన చేస్తున్నారు. నాకు భాష సరిగా రాదని అంటున్నారు. కానీ, చైనా వాళ్లకు కూడా ఇంగ్లీష్ రాదు. అయినా.. ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నారు. బాష ముఖ్యం కాదు.. భావం ముఖ్యం. భాష కేవలం కమ్యూనికేషన్ మాత్రమే. రాష్ట్రంలో ఏం చేస్తున్నామన్నది ముఖ్యం. నేనేమీ గుంటూరులో చదవలేదు. గూడు పుఠాణీ కూడా చేయలేదు'' అంటూ.. బీఆర్ ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు.
తనకు తెలిసిన భాష పేదవాడి ఆకలి కేకలు, నిరుద్యోగి ఉద్యోగ కష్టాలేనని రేవంత్ చెప్పారు. తాను గుంటూరులో చదువుకోకపోయినా.. పేదలను ఎలా కాపాడుకోవాలో.. వారిని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. కానీ.. గుంటూరులో చదువుకున్న వారు మాత్రం బెంజ్ కార్లలో వెళ్లి పేదరికం గురించి తెలుసుకుంటారని బీఆర్ ఎస్ నేత.. కేటీఆర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను సంపాయించుకునేందుకు, ఫామ్ హౌస్‌లు కట్టుకునేందుకు రాజకీయలు చేయడం లేదన్నారు.
''నాకు ఇంగ్లీష్ రాదని వాళ్లు అనుకుంటున్నారు. చైనా దేశానికి ఆ భాష రాదు. కానీ వాళ్ల వ్యాపారాలు, ఉత్పత్తులు నిలిపివేస్తే అమెరికా కూడా విలవిలలాడుతుంది.'' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. విద్యతోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, అందుకే గ్రామాల్లోనూ విద్యాలయాలు స్థాపిస్తున్నట్టు చెప్పారు.