బండి భగీరథ్‌ కేసు.. వెంటనే విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు!

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.;

Update: 2026-05-11 10:40 GMT

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. కేసుపై తక్షణమే విచారణ ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు. ఫిర్యాదు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు అందినా ఇప్పటి వరకు విచారణలో పురోగతి లేకపోవడంపై ముఖ్యమంత్రి నేరుగా డీజీపీని ప్రశ్నించారు. కేసు విషయంలో ఆలస్యం ఎందుకు జరిగిందని.. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ఆరా తీశారు. అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రికి వివరించారు.

అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో కేసు విచారణలో ఆలస్యం జరిగినట్లు డీజీపీ ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. నగరంలో ప్రధాని పర్యటనకు సంబంధించి విస్తృత భద్రతా చర్యలు చేపట్టడంతో అనేకమంది పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక విధుల్లో పాల్గొన్నారని తెలిపారు.

ఇదిలా ఉండగా కేసు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సమగ్ర విచారణ నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ పారదర్శకంగా జరగాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది.

బండి బగీరథ్ కేసు తీవ్రత దృష్ట్యా ఒక మహిళ ఐఏఎస్ తో సిట్ చేసేందుకు పోలీసులు యోచిస్తున్నట్టు తెలిసింది. సిట్ ద్వారా నిజానిజాలు నిగ్గుతేల్చడానికి రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కేసు పురోగతిపై అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News